దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ 32 దేశాల అగ్రనేతలకు మామిడిపండ్లు పంపించింది. కానీ తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు.. పాకిస్తాన్ ప్రయత్నం ఘోరంగా ఎదురు తన్నింది. పాకిస్తాన్ తో స్నేహపూర్వకమైన దేశం గా భావించే చైనా సైతం ఈ మామిడి పండ్లను తీసుకునేందుకు నిరాకరించడం విశేషం. కోవిడ్ నిబంధనలను కారణంగా చూపుతూ రష్యా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా, నేపాల్, టర్కీ, కెనడా తదితర దేశాలు కూడా తమకు మామిడిపండ్లు వద్దని నిర్మొహమాటంగా చెప్పేసి తిరిగి పంపించేశాయి. శ్రీలంక, నేపాల్, కెనడా వంటి దేశాలు మామిడి పండ్లను తిరిగి పంపించేస్తున్నందుకు తాము చింతిస్తున్నామని వెల్లడించాయి.

పాకిస్తాన్ దేశం స్నేహపూర్వకమైన బంధాలు బలపరచుకోవడానికి చాలా కాలం నుంచి అతి రుచికరమైన అన్వర్‌రొట్టోల్‌, సింధారి వంటి మామిడిపండ్లను ఇతర దేశాలకు పంపించేది. కానీ ఈ సారి కరోనా దృష్ట్యా ఆ మేలైన రకాల మామిడి పండ్లను పండించ లేదు. దీంతో కేవలం చౌన్సా రకపు మామిడి పండ్లను మాత్రమే 32 దేశాలకు పంపించింది. ఐతే ఈసారి పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్‌ అరిఫ్‌ అల్వి తరఫున ఈ మామిడి పండ్లను పాకిస్తాన్ దేశం పంపించింది. కానీ అనూహ్యంగా ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను వెనక్కి పంపించేశారు.

పాకిస్తాన్ మామిడి పండ్లను తిప్పి పంపించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2018 వ సంవత్సరం లో పాకిస్తాన్ పంపించిన మామిడిపండ్ల వెదురు బుట్టలలో ఈగలు ఉన్నాయని యునైటెడ్ కింగ్డమ్ తిరిగి పంపించేసింది. అంతేకాదు మామిడి పండ్ల ఎగుమతిదారుల లైసెన్స్ కూడా రద్దు చేసింది. ప్రతీ సంవత్సరం దౌత్య బంధాలు బలపరచడం కోసం పాకిస్తాన్ దేశం ఇతర దేశాల నేతలకు మామిడి పండ్లు పెద్ద ఎత్తున పంపించడం ఆనవాయితీగా వస్తోంది. 2015 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీతో సహా ప్రణబ్‌ ముఖర్జీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీ లకు అప్పటి  పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీప్‌ బుట్టల కొద్దీ మామిడి పండ్లు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: