బీహార్ రాజ‌కీయాల్లో సరికొత్త వివాదం చెలరేగింది. ప్రస్తుతం బీహార్ రాజ‌కీయాలు మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌డావిడి చేసిన బిహార్‌ యువ రాజకీయనేత చిరాగ్‌ పాశ్వాన్‌ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే లోక్‌ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావ‌డంతో ఈ ప‌రిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. చిరాగ్‌ పాశ్వాన్‌ ను లోక్‌ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుండి తొలగించారు.

ఎల్జేపీలో చిరాగ్‌ పాశ్వాన్‌ బాబాయ్‌, ఎంపీ పశుపతి పరాస్‌ నేతృత్వంలో తిరుగుబాటు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో పార్టీకి  చెందిన ఐదుగురు ఎంపీలు లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి స్పీకర్‌ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలసి తెలిపారు. ఇక పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన పరాస్‌ బృందం, పార్టీ పదవి నుంచి చిరాగ్‌ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. పరాస్‌, ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా, జాతీయాధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు. ఇక ఎల్‌జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరజ్‌భాన్ సింగ్‌ ఉంటారని పేర్కొన్నారు. ఈ తరుణంలో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరిగి పశుపతి కుమార్‌ పరాస్‌ చేతికి పార్టీ పగ్గాలు వస్తాయని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం.

ఇక ఎల్జెపి అధ్యక్షుడి పదవి నుండి తొలగించిన తరువాత ఆయన సమాంతర కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తానని ఆయన వెల్లడించారు. ఇక ఈ ప‌రిణామాల‌తో బీహార్ రాజ‌కీయాలు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: