ఏపీలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అనే సంగతి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు తెలుసు. కానీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు బాధ్యతలు ఏంటి? అంటే చాలానే ఉంటాయని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారిపోతే, మరికొందరు జగన్ దెబ్బకు బయటకు రావడం లేదు.
దీంతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అలాగే పలు నియోజకవర్గాల్లో పార్టీ చాలా వీక్‌గా ఉంది. అయితే అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న ఇప్పటివరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ చేసినట్లు కనిపించలేదు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు ధైర్యం చెప్పి, నాయకులని యాక్టివ్ చేయడం లేదు. అసలు అధ్యక్షుడి హోదాలో ఉండి అచ్చెన్న నియోజకవర్గాల్లో పర్యటించలేదు.
కానీ ఎంతసేపు జగన్‌పైన విమర్శలు చేయడంలో అచ్చెన్న ముందున్నారు. నిత్యం మీడియాలో మాత్రమే అచ్చెన్న ఉంటున్నారు. ఏదొక అంశంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల పార్టీకి వచ్చే లాభం ఏమి లేదు. అలా అని జగన్‌కు వచ్చే నష్టం కూడా ఏమి లేదు. ఎంతసేపు గుడ్డెద్దు చేలో పడ్డట్టు విమర్శలు చేయడం వల్ల జగన్ ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా నిత్యం జగన్‌ని తిట్టడం వల్ల వైసీపీకే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అచ్చెన్న కూడా అదే చేస్తున్నారని అంటున్నారు.
అయితే అచ్చెన్నకు చంద్రబాబే కళ్ళెం వేస్తున్నారనే వాదన కూడా ఉంది. గత తిరుపతి ఉపఎన్నికలో అచ్చెన్న పార్టీపై నోరు జారిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడిన వీడియో బాగా వైరల్ అయింది. ఇక అప్పటినుంచే అచ్చెన్నకు బాబు పవర్స్ కట్ చేశారని అంటున్నారు. అదే సమయంలో లోకేష్‌ని జిల్లాల పర్యటనలకు పంపుతున్నారు. అది కూడా టీడీపీ కార్యకర్తలకు గానీ, నేతలకు గానీ ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే లోకేష్ వస్తున్నారు. కానీ పార్టీ బలోపేతానికి మాత్రం లోకేష్ జిల్లాల పర్యటనలు చేయడం లేదు. మొత్తానికైతే అచ్చెన్నకు బాబే బ్రేక్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి