ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు రేపు అల్పపీడనం కారణంగా ఈ రోజు, రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి.  పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా దిలావపూర్ మండలంలో 24.7సెంటీమీటర్ల వర్షం పడింది. 99చోట్ల 7నుంచి 20సెంటీమీటర్ల కుండపోత వర్షం పడింది. స్వర్ణ ప్రాజెక్ట్ గేట్లు తెరిచారు. వానల ధాటికి ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం ఉగ్రరూపం దాల్చింది. గోదావరిపై ఉన్న ఎస్ఆర్ ఎస్ పీకి దాదాపు 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

గోదావరినదిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 62వేల 312క్యూసెక్కులు ఉండగా.. 10గేట్లు ఎత్తి 54వేల 590క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20వేల 17టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.64టీఎంసీలు ఉంది. ఎస్ఆర్ఎస్పీకి కూడా వరద కొనసాగుతోంది.

ఇక వర్షాల ధాటికి యాదాద్రిలోని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాలకు రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో యాదాద్రి కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకూడదంటున్నారు. మరోవైపు తీర ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: