ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌.. కొన్ని రోజులుగా ఈ పేరు బాగా వార్తల్లో నానుతోంది. తెలంగాణలో గురుకుల విద్యాలయాలు ఓ స్థాయికి తీసుకెళ్లిన అంకిత భావం ఉన్న అధికారిగా ఆయనకు మంచి పేరుంది. అలాంటి అధికారి మరో ఆరేళ్లు సర్వీసు ఉండగానే రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. అంతే కాదు..ఇకపై అంబేడ్కర్, పూలే, కాన్షీరామ్‌ మార్గంలో నడుస్తానని చెప్పడం కూడా కలకలం రేపింది. ఆయన్ను టీఆర్ఎస్‌ హుజూరాబాద్‌లో పోటీ కోసం రాజీనామా చేయించిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిని ప్రవీణ్ కుమార్ ఖండించారు.


అయితే అనూహ్యంగా.. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయనపై కరీంనగర్ జిల్లాలో కేసు నమోదైంది గతంలో ఆయన హిందూ దేవతలకు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తూ కించపరిచారన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసుపై మొదటి సారి స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇదంతా తనపై జరుగుతున్న కుట్రగా వర్ణించారు. ఉద్యోగం ఉన్నన్నాళ్లూ పట్టించుకోని వారు.. పదవికి రాజీనామా చేయగానే నాపైన కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. తాను కేసులు భయపడే వ్యక్తిని కాదన్నారు.


బడుగు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎన్నాళ్ళు కుల వృత్తులే చేసుకోవాలి అని ప్రశ్నించడానికే ఉద్యోగానికి రాజీనామా చేశానన్న ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని వదిలి పెట్టినందుకు మా అమ్మ బాధ పడిందన్నారు.. అమ్మా.. నీ ఒక్క కొడుకు బాగు పడితే సరిపోదు.. కోటి మంది బాగు పడేందుకే ఉద్యోగం వదిలేశా అని మా అమ్మకు సమాధానం ఇచ్చానన్నారు ప్రవీణ్‌ కుమార్.  తమ గురుకుల పాఠశాలల చదివిన విద్యార్థులకు ఉన్న ఆలోచన రాష్ట్రంలో ఉన్న 29మంది ఎమ్మెల్యేలకు ఉంటే బాగుంటుందని ఆర్ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.


ప్రవీణ్ కుమార్ అంటే ఒక్కడు కాదని.. కోటి కోట్ల మంది శక్తి ప్రవీణ్ కుమార్ అని ఆయన అన్నారు. తల్లి గర్భం నుంచి కాటికి కాళ్ళు చాచిన ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఓ ప్రవీణ్ కుమారేనని.. తాయిలాలకు, మోసపు మాటలు నమ్మి ఓటువేయొద్దని ఆయన పిలుపు ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సెంట్రల్ యూనివర్సిటీల్లో దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రొఫెసర్ల సంఖ్య 2శాతం కూడా దాటలేదని ఆయన గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: