ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా త‌ర్వాత సంక్రాంతికి ముందు ఎప్పుడు అయినా విస్తరణ ఉండవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారంటూ పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ సారి ఇద్ద‌రు డిప్యూటీ మ‌హిళా సీఎంలు ఉంటార‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త మంత్రి వర్గ విస్తరణలోనూ ముగ్గురు మహిళలు ఉంటారట‌.  ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గంలో గుంటూరు నుంచి మేకతోటి సుచరిత - విజయనగరం నుంచి పుప్షశ్రీవాణి - పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తానేటి వనిత ఉన్నారు. ఇక వీరిని త‌ప్పిస్తే కొత్త మ‌హిళా మంత్రులు ఎవ‌రు ఉంటారంటే... ఈ సారి కూడా జ‌గ‌న్ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళలనే మంత్రివర్గంలోకి వ‌స్తార‌ని అంటున్నారు.

బీసీ కోటాలో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ పేరు వినిపిస్తున్నా.. ఆమెకు అవ‌కాశాలు త‌క్కువే. ఎందుకంటే అక్క‌డ ఆమె కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉంది. ఇక ఎస్సీ కోటాలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావ, ఓసీ రెడ్డి కోటాలో న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా, బీసీ తూర్పు కాపు కోటాలో రెడ్డి శాంతి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి.

ఎస్టీ కోటాలో పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు ఉన్నా ఆమెకు ఆ వ‌ర్గంలో పోటీ ఎక్కువ ఉంది. వీరిలో న‌గ‌రి ఎమ్మెల్యే రోజా తప్ప అందరూ దాదాపు తొలిసారి శాసనసభకు ఎన్నికవ‌డంతో ఎవ‌రికి ఏ ఛాన్స్ ఉంటుందో ? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరికి ఛాన్స్ ఇస్తారో .. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: