పోలవరం పనుల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయా.. సొరంగం పనులు సక్రమంగా జరగడం లేదా.. తాజాగా ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కొండ జారిందంటూ వచ్చిన కథనం చూస్తే ఈ అనుమానాలు కలుగకమానవు. ఇప్పటికే జగన్ సర్కారు వచ్చిన తర్వాత పోలవరం పనుల్లో వేగం తగ్గిందని టీడీపీ నాయకులు విమర్శిస్తుంటారు. చంద్రబాబు గతంలో సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రతి వారం సమీక్షలు నిర్వహించేవారని గుర్తు చేస్తున్నారు.


ఇంతకీ ఆ కథనం చెప్పేదేంటంటే.. మామిడిగొంది-తోటగొంది గ్రామాల మధ్యలో 800 మీటర్ల పొడవున కుడివైపు సొరంగంలో కొండ కూలిదట. ఇక్కడ కొండ సొరంగంలోకి దిగిపోయింది. పోలవరం అనుబంధ పనుల్లో భాగంగా ఈ  జంట సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మార్గంలోనే ఈ గొయ్యి ఏర్పడిందని కథనం చెబుతోంది. ఈ గొయ్యి లోతు సుమారు 30 మీటర్లు ఉంటుంది. సొరంగాల లోపలి భాగం చుట్టూ లైనింగ్‌ పనులు సరిగ్గా చేయలేదని.. అందుకే కొండ బరువుకు పైభాగం కుంగిందని ఆ కథనం చెబుతోంది.


పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న రెండు సొరంగాల్లో కుడివైపు భాగంలోని సొరంగంలో కొంత కొండ భాగం జారింది.. అంటే కూలిందన్నమాట. జంట సొరంగాల నిర్మాణం మొదలై పుష్కరం దాటిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణంలో జాప్యం, లైనింగ్‌ పనులు నిలిచిపోవటం, రెండు కొండల వాలు ప్రాంతంలో సొరంగ మార్గం ఉండటం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. సొరంగాల లోపలి భాగం చుట్టూ 80 సెం.మీ. మందంతో కాంక్రీట్‌ లైనింగ్ పనులు చేపట్టాలి. అవి ఇంతవరకూ మొదలు కాలేదు.


అయితే.. కాంక్రీట్‌ లైనింగ్‌ పనుల్లో జాప్యమే ఈ కొండ కుంగుబాటుకు కారణంగా తెలుస్తోంది. సొరంగాలకు రెండు వైపులా కొండలు ఉన్నాయి. వర్షపు నీరు పైభాగంలో నిండుగా పారుతోంది. అందుకే సొరంగ ప్రాంతంలో రంధ్రాలు పడి బలహీనపడినట్టు భావిస్తున్నారు. కొండ బరువెక్కడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. అధికారులేమో..  జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం మరమ్మతు పనులు త్వరలోనే ప్రారంభిస్తామంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: