ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత్ లో ఎన్నికల తీరు మారుతోంది. మారిన కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఇది నిజమేననిపించక తప్పదు. భారత్ లో ఇప్పటి వరకూ ఎన్నికలు పాలక, ప్రతిపక్షాలకు రెఫరెండం లాంటివి. తాము చేసిన అభివృద్ధి పనులు, మెరుగుపడిన జన జీవితాలు, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. కానీ గత కాలంగా తీరు మారింది. ఓటరును, వారిచ్చే తీర్పును ప్రభావితం చేయడం పైనే అన్ని పార్టీల నేతలు తలమునకలై ఉన్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇటీవలి తెలుగు రాష్ట్రాలలో చరిత్రను పరిశీలిస్తే ఇది కొంత వరకూ మారింది.
ఆంధ్ర ప్రదేశ్ లో బద్వేల్ నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార పక్షానికి రెఫరెండంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు, వారి పార్టీలు ఎక్కడ కూడా ఈ ఎన్నిక పరిపాలనకు రెఫరెండం అని పేర్కోన లేదు. మరో వైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ కి చావు దెబ్బ తగిలింది. ఆ గట్టి దెబ్బ నుంచి కోలుకునే లోపలే బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. అయితే సిట్టింగ్ సభ్యులు మరణిస్తే, ఆ స్థానం వారికే విడిచి పెట్టాలి అనే సంప్రదాయం అనుసరించి పోటీకి తప్పుకుంటున్నట్లు టిడిపి ప్రకటించింది. ఇక మరో జన సేన పార్టీ కూడా ఇదే వాదనతో ఎన్నికల బరి నుంచి దూరంగా ఉంది.
ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. తమ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం పూర్తి చేశాయి. కొంతకాలం క్రితం వరకూ ఆంధ్ర ప్రదేశ్ ను ఏలిన కాంగ్రేస్ పార్టీ తాము చేసిన , చేయనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడగ లేదు. అధికార పక్షాన్ని విమర్శించడానికే ఆ పార్టీ నేతలు తమ సమయాన్ని వెచ్చించారు. ఇక బరిలో ఉన్న మరో జాతీయ పార్టీ బి.జే.పి కూడా విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తాము చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయండి అని వారు ఓటర్లను కోరలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మాత్రం పేర్కోన్నారు. సొమ్ములు మావి... సోకులు రాష్ట్ర ప్రభుత్వానికి అని విమర్శించారుకూడా. అంత వరకూ బాగానే ఉంది. ఈ ఉప ఎన్నిక మా కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు రెఫరెండం మాత్రం కాదు అని బిజేపి నేతలు బాహాటం గానే పేర్కోన్నారు. పార్లమెంటు ఎన్నికలు మాత్రమే తమకు రెఫరెండం అవుతాయని తమను తాము సమర్థించుకున్నారు.
ఇక అధికార పక్షం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నిక తమకు, తమ పరిపాలనకు రెఫరెండం అని పేర్కోన లేదు. తాము అములు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు పేర్కోంటున్నారు. ముఖ్యమంత్రి జనరంజక పాలన ను చూసి ఓట్లు వేయండని ఎన్నిక ప్రచారంలో పాల్గోన్న మంత్రులు, శాసనసభ్యులు ఓటర్లను కోరారు.
ప్రచార పర్వం ముగిసింది. ఇక ఎన్నికల క్రతువు మిగిలి ఉంది. ఈ ఉప ఎన్నిక మాత్రం ఏ పార్టీకి రెఫరెండం మాత్రం కాదు.
-
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి