దేశీయ కరోనా టీకా కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. భారత్ బయోటెక్ అందించిన అదనపు డేటాతో సంతృప్తి చెందిన డబ్ల్యూహెచ్ఓ కొవాగ్జిన అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్టు అధికారికంగా తెలిపింది. దీంతో కోవాగ్జిన్ వేసుకున్నవారు ఇత దేశాల్లో ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది. ఇదివరకు ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిపై పలు దేశాల్లో ప్రయాణ ఆంక్షలుండేవి.

ఇక మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా గుర్తింపునిచ్చింది. ఈ టీకా 2డోసులు తీసుకున్న వారు తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా గుర్తించగా.. తాజాగా కొవాగ్జిన్ కు కూడా ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణీకులు, విద్యార్థులు, నైపుణ్యమైన సిబ్బంది తిరిగి ఆస్ట్రేలియా వచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.

ఇక కోవిడ్ వ్యాక్సిన్ తో పోలిస్తే బూస్టర్ డోస్ తీసుకున్న వారికి అధిక రక్షణ ఉంటుందని లాన్సెట్ జర్నల్ అధ్యయనం తెలిపింది. ఫైజర్ బూస్టర్ డోస్ తీసుకున్న 7.28లక్షల మందిపై సర్వేచేయగా.. ఐదు నెలల క్రితం 2డోసులు తీసుకున్న వారితో పోలిస్తే ఈ బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో అధికంగా యాంటీబాడీలు ఉత్పన్నమైనట్టు వెల్లడైంది. వీరిపై కరోనా తీవ్రత తక్కువగా ఉందట. అయితే బూస్టర్ డోస్ వాడకంపై ఇంకా ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వలేదు.

కరోనాకు కాక్ టెయిల్ తో పూర్తిగా చెక్ పెట్టొచ్చని తేలింది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సామర్థ్యంపై ఏఐజీ హాస్పిటల్స్, సీసీఎంబీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది రుజువైంది. ఒక్క ఇంజెక్షన్ తో కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తేలింది. కరోనా నిర్ధారణ అయిన 3నుంచి 4రోజుల్లో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల 100శాతం సానుకూల ఫలితాలు వస్తున్నట్టు తేలింది. మొత్తానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కొవాగ్జిన్ కు అనుమతి ఇవ్వడంతో కరోనాను కంట్రోల్ చేసేందుకు మరో ఆయుధం దొరికినట్టయింది.






 


మరింత సమాచారం తెలుసుకోండి: