మన దేశంలో పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొవాగ్జిన్ టీకా ఇప్పుడు మరో ఘనత సాధించింది. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రపంచంలోనే పేరున్న ప్రముఖ హెల్త్ జర్నల్‌ లాన్సెట్ ప్రచురించింది. కొవాగ్జిన్ టీకా 93 శాతం సమర్థతతో పనిచేస్తోందని లాన్సెట్ తన పరిశోధన వ్యాసంలో ప్రచురించడం విశేషం. కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలు ప్రచురించిన లాన్సెట్... ఈ టీకా మరింత సురక్షితమైందని పేర్కొంది.


కొవాగ్జిన్ ద్వారా కొవిడ్ లక్షణాలు తీవ్రం కాకుండా 93.4 శాతం వరకూ రక్షణ లభిస్తుందని లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. తమ కొవాగ్జిన్ టీకా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా రోగనిరోధకత పెంచుతోందని తయారీ సంస్థ భారత్ బయోటెక్ ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌లో 0.5 శాతం కంటే తక్కువ మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని.. ఇది ఓ అత్యుత్తమ రికార్డ్ అని ఆ సంస్థ ప్రకటించింది. అంతే కాదు.. ఇటీవలి కాలంలో కరోనా సెకండ్ వేవ్‌లో హడలెత్తించిన కరోనా డెల్టా వేరియంట్‌ను కూడా కోవాగ్గిజన్ సమర్థంగా ఎదుర్కొంటోందట.

 
డెల్టా వేరియంట్లు సోకకుండా కొవాగ్జిన్ 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని లాన్సట్ తెలిపింది. కొవాగ్జిన్ ద్వారా కరోనా వేరియంట్ల నుంచి 70.8 శాతం రక్షణ దొరుకుతుందని లాన్సెట్ తన పరిశోధన పత్రంలో ప్రచురించింది. కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలపై ఐసీఎంఆర్ కూడా హర్షం వ్యక్తం చేసింది. భారతీయ స్వదేశీ టీకా అయిన కొవాగ్జిన్‌కు ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, ఇంగ్లాండ్ వంటి దేశాలు కోవాగ్జిన్‌ను కరోనా టీకాగా గుర్తించాయి.


కొవాగ్జిన్ టీకా వేయించుకున్న ప్రయాణికులకు తమ దేశంలోకి రాగానే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేకుండా సడలింపు ఇస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాల్లోనూ ఇప్పటి వరకూ 90కు పైగా దేశాలు కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి అనుమతులు ఇస్తున్నాయి. ఇప్పుడు తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఈ విశేషాలు భారత్ బయోటెక్ సంస్థతో పాటు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: