చాలారోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఆయన తిరుపతి వచ్చారు. కర్ణాటక, ఏపీతో పాటూ పలు రాష్ట్రాల సీఎంలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎంలతో చాలా విషయాలపై చర్చించి, సమస్యలను పరిష్కారం చేశారు. సమస్యలపై ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా అమిత్ షా చెప్పారు. అయితే ఆయన ఈ సమావేశం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కపిలేశ్వర స్వామివారి క్షేత్రాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఏపీ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. బీజేపీ నేతలతో సమావేశమై ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ ముగిసిన అనంతరం ఏపీలోని బీజేపీ నేతలతో తాజా రాజకీయాలపై అమిత్ షా ఆరా తీశారట. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అసలేం జరుగుతుందని ప్రశ్నించినట్టుగా సమాచారం. స్థానిక బీజేపీ నేతల వద్ద నుంచి సమాచారం తీసుకొని.. తనకున్న ఇన్ పుట్స్ తో వారికి కొన్ని సూచనలు చేశారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి విషయం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. బీజేపీ అమరావతికి అనుకూలమని, ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలపాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇది బయట జరుగుతున్న ప్రచారమా.. లేక నిజంగానే అమిత్ షా అమరావతికి మద్దతిచ్చారా అనే విషయం బీజేపీ నేతలకు మాత్రమే తెలుసు.

అయితే ఒకవేళ నిజంగానే బీజేపీ అమరావతికి సపోర్ట్ చేస్తే.. ఇక టీడీపీ పరిస్థితి ఏమిటన్నది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అమరావతి రైతుల ఆందోళనను, పాదయాత్రను వెనకుండి నడిపిస్తోంది టీడీపీయేననేది వైరి పక్షాల ఆరోపణ. అయితే ఇప్పుడు బీజేపీ అమరావతి ఇష్యూని హైజాక్ చేస్తే.. టీడీపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో అమిత్ షా టీడీపీతో కలిసి నడిచేందుకే, ఇలా అమరావతికి మద్దతు పలికారా అనే ప్రశ్నలు కూడా బీజేపీ నేతల్లో నెలకొన్నాయి. ప్రస్తుతానికి జనసేనతో కలిసి నడుస్తున్నామని.. భవిష్యత్తులో టీడీపీతో కలవకతప్పదన్నట్టుగా అమిత్ షా సంకేతాలిచ్చారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: