మాములుగా కాదు చాలా పెద్ద స్థాయిలోనే మార్పులు జరిగిపోయాయి నెల్లూరు పరిణామాలకు సంబంధించి.! సీఎం దగ్గర జరిగిన చర్చోపచర్చలు ఫలించి, ఎవ్వరూ కలలో అయినా ప్రతిపాదించని పేరు ఒకటి తెరపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ముందు నుంచి పార్టీకి కట్టుబడి పనిచేసిన వారంతా కూడా ఇప్పుడు డైలమాలో పడిపోయారు. మంత్రి అనీల్ కూడా అదేవిధంగా డైలమాలో పడిపోయారు. రాజకీయం తనకు అందకుండా ఎవ్వరో చెప్పిన విధంగా నడుచుకునే స్థాయిలో ఉందన్న బాధలోనో తీవ్ర నిరాశలోనో ఉన్నారు మంత్రి అనీల్. ఆయనకు కూడా అందని విధంగా పార్టీలో ఓ కీలక నేత చక్రం తిప్పి పరిణా మాలను తమకు అనుగుణంగా మార్చి నెల్లూరులో రెడ్ల మాటే చెల్లింపు అయ్యేలా చేసిన ఘనత దక్కించుకున్నారు. దీంతో తా జాగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా మార్చనుందో మరి!
నెల్లూరు మేయర్ ఎంపికకు సంబంధించి అదిరిపోయే ట్విస్టు ఇది. మొదట్నుంచి భావించిన అభ్యర్థిని కాకుండా మరొకరికి అనూహ్యంగా పదవి వరించడం ఈ కథలో ఓ కీలక మలుపు. సినిమా స్టోరీని మించిపోయే విధంగా ఈ కథకు కూడా కర్త, కర్మ, క్రియ కూడా ఒకరున్నారు. ఏదైతేనేం సొంత సామాజికవర్గ నేత మాటకు ఓటు వేశారు జగన్. అవును! ముందునుంచి అనుకున్న విధంగా 53 వ డివిజన్ (నగర పరిధికి చెందిన డివిజన్ ఇది మంత్రి అనీల్ ప్రాబల్యం ఉన్న డివిజన్ ఇది) నుంచి కార్పొరేటర్ గా గెలిచిన దేవరకొండ సుజాతకు కాదని, ఈ పదవిని అదే సామాజికవర్గం (ఎస్టీ) కి చెందిన 12 వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి స్రవంతికి కేటాయించారు అని సమాచారం. స్రవంతి భర్త పొట్లూరి జయవర్థన్ విద్యార్థి నాయకుడు అని స్థానికంగా అందుతున్న ప్రాథమిక సమాచారం. దీంతో ఇప్పుడు అంతా ఊహించిన విధంగా కాకుండా అందుకు విభిన్నంగా నెల్లూరు రాజకీయం నడుస్తోంది. జగన్ సర్కారులో కీలకంగా ఉన్న ఓ పెద్ద ఈ కథనంతా నడిపించి ఆఖరులో తన మాట నెగ్గించుకుని, మంత్రి అనీల్ ను ఓడగొట్టారు. దీంతో ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గం అంతా ఆనందోత్సాహాలులో మునిగి తేలుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి