రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్‌ ఓ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపేసిన రైళ్లలో భోజన సౌకర్యాన్ని పునరుద్దరిస్తున్నట్టు ప్రకటించింది. రాజధాని, దురంతో, శతాబ్ది, వందే భారత్, తేజస్, గతిమాన్‌ వంటి రైళ్ల ప్రయాణీకులకు ఈ శుభ వార్త  వర్తిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని రైళ్లలో ఆహార సరఫరా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చేసింది.


కరోనా కారణంగా నిలిపి వేసిన సౌకర్యాన్ని పునరుద్దరిస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ఇటీవల బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు రైల్వే అమల్లోకి తీసుకొచ్చింది. అయితే.. కరోనా జాగ్రత్తలతో... రైళ్లలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని తమ విభాగాలకు సూచించింది. ఈ మేరకు ఐఆర్‌సిటిసి, అన్ని జోన్ల కమర్షియల్‌ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చేసింది రైల్వే బోర్డు. కరోనా రైలు ప్రయాణాలను తీవ్రంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే.


కరోనా సమయంలో నెలల తరబడి రైళ్ల ప్రయాణాలు ఆగిపోయాయి కూడా. చాలా రోజుల పాటు జనం రైల్వే సేవలను వినియోగించుకోలే పోయారు. ఆ తర్వాత కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా సమయంలో వలస కార్మికులను వేల కొద్దీ ప్రత్యేక రైళ్లలో వారి సొంత ప్రాంతాలకు తరలించింది రైల్వే శాఖ. అంతే కాదు.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రైల్వే శాఖ.. ఆక్సిజన్ తరలింపులో కీలక పాత్ర పోషించింది.


అనేక నెలల గ్యాప్ తర్వాత కొన్నాళ్ల క్రితం రైల్వే సేవలను పునరుద్దరించారు. అయితే.. కరోనా భయం కారణంగా రైళ్లలో భోజన సేవలను మాత్రం నిలిపేశారు. వంట, పంపిణీ వంటి సమయాల్లో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రకటించిన కరోనా మార్గదర్శకాలు కూడా ఈ నిర్ణయానికి కారణం అయ్యాయి. అయితే ఇటీవల కరోనా విజృంభణ చాలా వరకూ తగ్గిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో తమ ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు రైల్వే శాఖ భోజన సేవలను పునరుద్ధరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: