ఇటీవల హైరిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారి ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఒమిక్రాన్ హైరిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి నగరానికి వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ గా తేలింది. వీరిలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లేదని జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ తేల్చింది. ఈ లెక్కన తెలంగాణలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు.

ఇక ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నిఘా పెట్టనున్నారు. కరోనా టెస్టింగ్ బూత్ లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని గేట్ల దగ్గర థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో చేసే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం 750రూపాయలు, ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ కోసం 3వేల 900రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. చల్మెడ మెడికల్ కాలేజీలో కొవిడ్ బాధితుల సంఖ్య 49కి చేరింది. మరో 100మంది విద్యార్థులు శాంపిలస్ ను టెస్టుకు పంపినట్టు వైద్య సిబ్బంది తెలిపింది. మొత్తం వేయి మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 49మంది పాజిటివ్ గా తేలారు. ఇప్పటికే కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.

ఇక వచ్చే ఆరు వారాలు చాలా కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమనీ.. కరోనా నిబంధనలు పాటిస్తే బయటపడొచ్చన్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతటా విస్తరించే అవకాశముందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డా.మనీంద్ర అగర్వాల్ అన్నారు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయన్నారు. మొత్తానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను హఢలెత్తిస్తోంది. దాని బారిన పడకుండా ప్రజలు కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.










మరింత సమాచారం తెలుసుకోండి: