కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 144 వార్డులు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ 134 వార్డులలో విజయం నమోదు చేసింది. ఈ విషయాన్ని బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ధ్రువీకరించారు. మొత్తం 144 వార్డుల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు వార్డుల్లో మాత్రమే గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు వార్డుల్లోనే గెలిచింది. దశాబ్దాల తరబడి బెంగాల్‌ను ఏలిన వామపక్షాలు కేవలం రెండు వార్డుల్లోనే గెలిచాయి. షాకింగ్ ఏంటంటే.. మూడో చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు.
ఈ ఫలితాల్లో మమతా బెనర్జీ పార్టీ ఎవరినీ అందనంత ఎత్తులో విజయం నమోదు చేసింది. ఓట్ల శాతాలు చూస్తే.. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 72 శాతం ఓట్లు వచ్చాయి. 11 శాతం ఓట్లతో వామపక్షాలు రెండో స్థానంలో నిలిచాయి. ఇక బీజేపీ మరీ దారుణంగా కేవలం 9 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 శాతం ఓట్లే పోలయ్యాయి. సాధారణంగా ఏళ్లు గడుస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకతతో ఓట్లు, సీట్లు తగ్గాలి.. కానీ.. గత కార్పొరేషన్ ఎన్నికలతో పోలిస్తే అధికార టీఎంసీకి 22శాతం ఎక్కువ ఓట్లు రావడం విశేషం.
ఈ ఎన్నికలతో మరోసారి మమతా బెనర్జీ చేతిలో నరేంద్ర మోడీ చిత్తు చిత్తు అయ్యారని టీఎంసీ నేతలు ఘనంగా చెప్పుకుంటున్నారు. అంతే కాదు.. ఇదే తరహా ఫలితాలు రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనూ కనిపిస్తాయని చెబుతున్నారు. మరి అంత సీన్ ఉంటుందా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి