తెలుగుదేశంపార్టీ వ్యూహాత్మకంగా వంగవీటి రంగా వ్యవహారాన్ని తెరమీదకు తెస్తోంది. విభజిత విజయవాడ  జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టింది ప్రభుత్వం. ఇదే సందర్భంగా వంగవీటి రంగా  పేరు పెట్టాలని టీడీపీ డిమాండ్ మొదలుపెట్టింది. ఇదే విషయమై మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ దీక్ష కూడా మొదలుపెడుతున్నారు. పైగా రంగా కొడుకు వంగవీటి రాధా వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారు.




ఇక్కడ విచిత్రం ఏమిటంటే వంగవీటి పేరు పెట్టాలని డిమాండ్ చేయాల్సింది కొడుకు వంగవీటి రాధా. అయితే డిమాండ్ చేస్తున్నది రంగాతో ఎలాంటి సంబంధం లేని టీడీపీ, బోండా ఉమ. దీనితో ఆగకుండా తమ డిమాండ్ విషయంలో రాధా ఆలోచనలు ఏమిటో తనే నిర్ణయించుకోవాలంటు చెప్పటం. అంటే బోండా ఉద్దేశ్యంలో రాధాను కూడా దీక్షలోకి లాగటమే. ఎందుకంటే జిల్లాకు తన తండ్రి వంగవీటి రంగా పేరు పెట్టాలని రాదా కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు.




మరి కొడుకు రాధాకు లేని సమస్య టీడీపీకి బోండాకు ఎందుకొచ్చింది ? ఎందుకంటే రాజధాని జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణాలోని కాపులను వైసీపీకి దూరం చేయాలనే ప్లాన్ మొదలుపెట్టింది టీడీపీ. ఇందులో భాగంగానే కాపు సామాజికవర్గానికే చెందిన బోండా తోనే చంద్రబాబునాయుడు దీక్ష చేయిస్తున్నారు. విభజిత జిల్లాలో ఒకదానికి పాతపేరు కృష్ణా పేరే ఉంది. రెండోదానికి జగన్మోహన్ రెడ్డి హామీఇచ్చినట్లుగా ఎన్టీయార్ పేరు పెట్టేశారు.




ఈ రెండు మారదని అందరికీ తెలుసు. ఒకవేళ తమ తండ్రి పేరు జిల్లాకు అవసరం లేదని ఎన్టీయార్ కుటుంబసభ్యులు ఏమైనా డిమాండ్ చేస్తే బహుశా జగన్ అప్పుడు ఆలోచిస్తారేమో. కానీ ఎన్టీయార్ కుటుంబసభ్యులు ఆ డిమాండ్ చేయగలరా ? డిమాండ్ చేసి మళ్ళీ జనాలకు ఎన్టీయార్ అభిమానులకు, కమ్మ సామాజికవర్గానికి సమాధానం చెప్పుకోగలరా ? అందుకనే కొత్త జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టడం దాదాపు అసాధ్యమని అందరికీ తెలిసిందే. ఈ విషయం టీడీపీకి కూడా బాగా తెలుసు. తెలిసి కావాలనే కాపులను దూరం చేయటమే టార్గెట్ గా రాజకీయం చేస్తోందంతే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: