యుద్ధం అంటూ వస్తే గెలిచే వారెవరూ ఉండరు. యుద్ధంలో ఓడిపోయిన దేశంలో ఎలాగూ సర్వనాశనం అవుతుంది. గెలిచిన దేశం కూడా పెద్దగా లాభపడేదేమీ ఉండదు. అందులోనూ సుదీర్ఘ కాలంపాటు సాగే యుద్ధాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తాయి. అందులోనూ.. రష్యా, ఉక్రెయిన్ వంటి పెద్ద దేశాలు యుద్ధానికి పాల్పడితే ఆ ప్రభావం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాదు.. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన ఈ గ్లోబలీకరణ ప్రపంచంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా దాని ప్రభావం ప్రపంచం అంతా ఉంటుంది.


ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఒక్కటే కాదు.. రష్యా కూడా బాగానే నష్టపోతోంది. అన్నింటి కంటే ఎక్కువ నష్టం ప్రాణ నష్టం.. ఇప్పటికే వేల సంఖ్యలో రష్యా సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఆ దేశం చెప్పిన స్థాయిలో కాకపోయినా.. రష్యా సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లోనే ఉంటారు. ఇక యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఒత్తిడికి లోనవుతోంది. రష్యా పౌరులు ఇప్పటికే ఈ మూల్యం చెల్లించుకుంటున్నారు.


ఉక్రెయిన్‌ తో జరిగిన యుద్ధం ద్వారా వాటిల్లిన నష్టం నుంచి తేరుకునేందుకు రష్యాకు కొన్ని తరాలు పడుతుందంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. ఇక ఇప్పడుు ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించి, న్యాయం చేయాల్సిన సమయం వచ్చిందంటున్నారాయన. రష్యా అలా చేయకపోతే.. రష్యాకు  కోలుకోలేని నష్టం తప్పదని జెలెన్‌ స్కీ హెచ్చరిస్తున్నారు. రష్యా ఉద్దేశపూర్వకంగా మానవ సంబంధిత విపత్తు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని జెలెన్‌ స్కీ మండిపడుతున్నారు.


ఉక్రెయిన్- రష్యా మధ్య మరింత రక్తపాతం జరగకుండా పుతిన్‌ తనతో చర్చలు జరపాలని జెలెన్‌స్కీ అంటున్నారు. రష్యా ఇప్పటికే 14 వేల మంది సైనికుల్ని కోల్పోయిందని.. మరికొన్ని వేలమంది గాయపడ్డారని... ఇప్పటికైనా రష్యా తన దాష్టీకాన్ని ఆపకపోతే చివరకుమరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జెలెన్‌ స్కీ హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు జరిగిన నష్టం గురించి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ వీడియో ద్వారా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: