ఊరంతా ఒకదారైతే ఉలిపిరికట్టది మరోదారి అన్న సామెతలాగ తయారైంది జనసేన అధినేత పవన్ కల్యాన్ వ్యవహారం. పార్టీలోని నేతలు, జనసైనికులు, అభిమానులేమో వచ్చే ఎన్నికల్లో పవన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబునాయుడును సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. పవన్ వైఖరితోనే పార్టీలో అసలు సమస్య పెరిగిపోతోంది. మామూలుగా ఎవరైనా తమకు ఏదైనా కావాలని కోరుకుంటారు. కానీ పవన్ మాత్రం పక్కోడికి పలానాది దక్కాలని కోరుకుంటున్నారు.





దీనివల్ల ఏమవుతుందంటే పవన్ ది ఉదారగుణం అనిపైకి అనిపించినా చూసేవాళ్ళకది  చేతకాని తనమని బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు రెండోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరికి అవకాశం ఇచ్చేశారు కాబట్టి మూడోసారి తనకు జనాలు ఎందుకు అవకాశం ఇవ్వరని పవన్ అనుకుంటున్నారు. ఇదే సమయంలో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కు దక్కాలని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.





అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ’రాజకీయాల్లో ఎవరూ ఏదీ ఇవ్వరు. అన్నీ మనం లాగేసుకోవాలంతే’ అనే సినిమా డైలాగుంది. డైలాగులో చెప్పినట్లే 2019 ఎన్నికల్లో అధికారాన్ని చంద్రబాబు దగ్గరనుండి జగన్ ప్రజాబలంతో  లాగేసుకున్నారు. మరి జగన్ లాగేసుకున్నట్లే పవన్ లాగేసుకోవాలంటే ప్రజాబలముందా ? ప్రజల మద్దతుండేట్లుగా పవన్ అసలు ఏమిచేశారు ? రోజుకో ప్రకటన చేస్తు, జనాలను, జనసైనికులతో పాటు నేతలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.





తనకసలు అధికారమే అవసరంలేదంటారు. అధికారం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదంటారు. అధికారం కోసం తాను పాతికేళ్ళయినా వెయిట్ చేస్తానని మరోసారి చెప్పారు. ఇంతచేసి చివరకు ఏమిచేస్తున్నారంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటం కోసమే రాజకీయాలు చేస్తున్నారు. మొత్తంమీద తన విచిత్రమైన వైఖరితో అభిమానులకే పవన్ పిచ్చెక్కిచేస్తున్నారు. తాను సీఎం కావాలని చిత్తశుద్దితో అనుకుని కచ్చితమైన రాజకీయం చేయనంతవరకు పవన్ అధికారంలోకి రావటం కలలోనే మాట. ఎవరినో సీఎం చేయటం కోసమైతే అసలింత రాజకీయం చేయాల్సిన అవసరం కూడా లేదని గ్రహిస్తేమంచిది.




మరింత సమాచారం తెలుసుకోండి: