ముఖ్యమంత్రయిపోవాలి..ముఖ్యమంత్రయిపోవాలి ఇదే ధ్యాస ఇద్దరిలోను. జనాలు ఆదిరస్తున్నారా లేదా అని చూసుకునేదిలేదు. ఎన్నికలు రావటం ఆలస్యం జనాలు పోలోమంటు వచ్చి తమ పార్టీకి మద్దతుగా ఓట్లుగుద్దేసి ముఖ్యమంత్రిగా తమను కూర్చోబెట్టేస్తున్నారని కలలు కంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు ? ఎవరంటే ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణాలో వైఎస్సీర్టీపి అద్యక్షురాలు షర్మిల.






తాజాగా షర్మిల మీడియాతో మాట్లాడుతు తెలంగాణాలో వైఎస్సార్ బిడ్డ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి కావాలని జనాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. షర్మిలను ముఖ్యమంత్రిగా చూడాలని ఎవరు కోరుకుంటున్నారో తెలీదు. షర్మిలను అసలు సీఎంగా జనాలు ఎందుకు చూడాలని అనుకుంటున్నారు ? దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు అనే తప్ప షర్మిలలో ఇంకేమి అర్హతలున్నాయి ? పార్టీ పెట్టడంలో తప్పులేదు, అధికారంలోకి రావాలని అనుకోవటంలోనూ తప్పులేదు.





కానీ అందుకు జనాల ఆమోదం అవసరమన్న విషయాన్ని షర్మిల మరచిపోయారు. తనచుట్టూ చేరిన పదిమంది తనను ఉద్దేశించి సీఎం సీఎం అని పదిసార్లంటే షర్మిల ముఖ్యమంత్రి అయిపోతారా ? ఇప్పటికైతే షర్మిలను జనాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉనికి కోసమే అవస్తలు పడుతున్న షర్మిల ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్నారు. ఇదే పద్దతిలో ఏపీలో పవన్ కూడా నానా రచ్చ చేస్తున్నారు. తనను సీఎంగా చూడాలని జనాలంతా కోరుకుంటున్నారంటు సొల్లు చెబుతుంటారు. నిజంగానే పవన్ను సీఎంగా చూడాలని జనాలు అనుకుంటే పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఎందుకు ఓడిస్తారనే స్వీయవిశ్లేషణ కూడా లేదు.





వచ్చే ఎన్నికల్లో ఎన్నిసీట్లకు పోటీచేస్తారో తెలీదు, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలో కూడా తెలీదు అయినా తనను సీఎంగా చూడాలని జనాలు కోరుకుంటున్నారనే భ్రమల్లో ముణిగిపోయారు. విచిత్రం ఏమిటంటే ఇద్దరి పార్టీల తరపున అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా లేరు. అసలు పార్టీ నిర్మాణాలే జరగలేదు. రెండుపార్టీల్లోను చెప్పుకోదగ్గ నేతలే లేరు. అభ్యర్ధులను రెడీ చేసుకోలేని వీళ్ళు ముఖ్యమంత్రలైపోదామని కలలు కనటం బ్రహ్మాండంగా ఉంది.


 



మరింత సమాచారం తెలుసుకోండి: