ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దెబ్బ ఎలాగుంటుందో రుచిచూపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని వెంటనే ఆచరణలోకి తెచ్చి చూపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే బేగంపేటలోని ప్రగతిభవన్ ముందు మాజీ సీఎం కేసీయార్ రోడ్డు ఫుట్ పాత్ ను ఆక్రమించుకుని పెద్ద గోడ కట్టేసుకున్నారు. గోడంటే ఇనుప గ్రిల్స్ తో తయారుచేసిన 13 అడుగుల ఎత్తయిన కంచెను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఈ కంచె అవసరం లేకపోయినా తన దర్పాన్ని చూపించటానికే కేసీయార్ ఇలాగ చేశారు.





కేసీయార్ చేసిన పనివల్ల జనాలు దాదాపు పదేళ్ళు  బాగా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే బేగంపేటలోని మెయిన్ రోడ్డు  అంటేనే ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి రోడ్డును ఫుట్ పాత్ ఆక్రమించటమే కాకుండా రోడ్డును కూడా సగం ఆక్రమించేశారు. స్వయంగా ముఖ్యమంత్రే రోడ్డును ఆక్రమించి కంచె వేసేస్తే అడ్డుకునేది ఎవరు ? అందుకనే ఆ రోడ్డులో వెళ్ళే జనాలు రెగ్యులర్ గా కేసీయార్ ను తిట్టుకుంటూనే తిరిగే వాళ్ళు. జనాల సమస్యలను, ఇబ్బందులను గమనించిన రేవంత్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ గోడను తొలగిస్తామని హామీ ఇచ్చారు.





సీన్ కట్ చేస్తే గురువారం ఉదయం నుండి రోడ్డు, ఫుట్ పాత్ ను ఆక్రమించుకుని నిర్మించిన గోడను అధికారులు తొలగించేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు అంటే ఉదయమే పోలీసులు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చారట. సాయంత్రానికల్లా 13 అడుగుల ఎత్తయిన గోడను పూర్తిగా తొలగించాలని చెప్పారట.





దాంతో ఉదయం నుండే అధికారులు రంగంలోకి దిగేసి గోడను తొలగించేపనుల్లో బిజీగా ఉన్నారు. సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే గోడను తొలగించేశారు. దాంతో జనాలంతా ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. పది సంవత్సరాలు పాటు జనాలను నానా ఇబ్బందులు పెట్టిన ఆ గోడను తొలగించటంపై జనాలు రేవంత్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో రేవంత్ ను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: