క్షవరం అయితే  కానీ వివరం అర్థం అవుతుందని ఓ సామెత ఉంటుంది. ఈ సామెత మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు కళ్లకు కడుతోంది. అతనికి మాత్రమే కాదు అక్కడ పర్యాటక సంస్థలకు, హోటళ్లకు, విమానయాన సంస్థలకు అవగతం అవుతోంది. ప్రధాన మంత్రి లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన తర్వాత.. ఆ ప్రాంతంలో వీడియోలు, ఫొటోలు తీసి.. మీ తదుపని సాహస పర్యటన లక్ష్యదీప్ మాత్రమే కావాలి. మీకు సాహస క్రీడలంటే ఇష్టమైతే కచ్ఛితంగా లక్ష్యదీప్ ప్రాంతాన్ని ఎంచుకోవాలని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.


ఎప్పుడైతే ప్రధాని ఈ మాట అన్నారో అప్పుడే మాల్దీవులు ప్రభుత్వానికి కాలడం ప్రారంభమైంది. ఫలితంగా భారత్ మీద వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేసింది. మాల్దీవుల్లా స్వచ్ఛమైన పర్యాటకాన్ని కొనసాగించడం భారత్ వల్ల కాదు అనే అర్థం వచ్చే లాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో దెబ్బకు భారతీయులకు కోపం వచ్చింది. ఆ కోపం తాలూకూ పరిణామాలు మాల్దీవులు ఇప్పుడు అనుభవిస్తోంది.


ప్రధాని పిలుపు మేరకు చాలామంది లక్ష్యదీప్ పర్యటనకు  వెళ్తున్నారు. గత పదిహేను రోజులుగా అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరోవైపు మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది డిసెంబరు 31వరకు మన దేశం నుంచి 2,09,198మంది మాల్దీవులను సందర్శించారు.. ఈ  దేశంలో మన పర్యాటక వాటా 11శాతం. గతంలో మన దేశం నుంచి ఎక్కువ మంది మాల్దీవులు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అది ఐదో స్థానానికి పడిపోయింది.


ఇదిలా ఉండగా తాజాగా మాల్దీవులకు ఎకనామిక్ జోన్ సముద్రంలో చేపలు పడుతున్న మూడు బోట్లను భారత్ ఆర్మీ అడ్డగించిందని ఇందుకు వివరణ ఇవ్వాలని మాల్దీవులు ప్రభుత్వం భారత్ ను కోరింది. తమ బోట్లను విచారించినందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బోర్డింగ్ టీమ్స్ బాధ్యత వహించాలని ప్రకటనలో కోరింది. అయితే ఇందులో వాస్తవం ఏమిటంటే.. భారత ప్రాదేశిక జలాల్లోకి వాళ్లు అడుగుపెడుతున్నారు.  గతంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించేంది. ఇప్పుడు వీటిపై కూడా భారత్ ఆంక్షలు విధిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: