ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా ప్రజల ముందుకు రానున్నాయి. బీజేపీ కూడా కలిసి మహా కూటమిగా వచ్చి తాడోపేడో తేల్చుకుంటాయి అనే విశ్లేషణలు సాగుతున్నాయి. కానీ బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.


ఇందులో జనసేనకు టీడీపీ 24 సీట్లు కేటాయించింది. అందులో పవన్ ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి మిగతా వాటిని సస్పెన్స్ లో పెట్టారు. కేవలం 24 సీట్లు తీసుకోవడం పట్ల కాపు సామాజిక వర్గ నేతలు పవన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇన్ని సీట్లతో రాజ్యాధికారం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా సభలో పవన్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం తనను గుర్తించలేదని.. ఇప్పుడు మాత్రం తనను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.


తమ వాడు మంచి వాడు అని భావించినప్పుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై లేదా  అని ఆయన ప్రశ్నించారు. అందుకే మీకు తనను ప్రశ్నించే హక్కు మీకు లేదని.. కాపు నేతలను ఉద్దేశించి తేల్చి చెబుతున్నారు. తనకు ఎవరి సలహాలు , సూచనలు అవసరం లేదని.. నా పార్టీకి, నాకు కొన్ని వ్యూహాలు ఉన్నాయంటూ వారిచ్చే సలహాలను కొట్టిపారేస్తున్నారు.


అయితే ఈ వ్యాఖ్యలు జనసైనికులను ఆలోచింపజేస్తున్నాయి. కనీసం 20శాతం అభిమానులు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. మిగతా 80శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ముందు ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపిన తర్వాత చూద్దాం అనే ఆలోచనలో జనసైనికులు ఉన్నారు. ముందు అసెంబ్లీకి జనసేన ప్రాతినిథ్యం వహిస్తే ఆ తర్వాత పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది. నిజంగా పవన్ ఈ వ్యూహంతోనే చంద్రబాబుతో పొత్తుకు అంగీకరించారేమో అని ఆలోచిస్తున్నారు. తద్వారా అసంతృప్తి, ఆగ్రహావేశాలను తన ఆవేశపూరిత ప్రసంగం ద్వారా దారిలోకి తెచ్చుకోగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: