పదవిలో ఉంటే రారాజు.. పదవిని కోల్పోతే పేదరాజు అన్న మాదిరి తయారయింది తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్‌ పరిస్థితి. ఈ గులాబీ అధినేతకు ప్రస్తుతం సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆయనికి ఇరువైపులా, అవసరమైతే ఆకాశంలో కూడా జెడ్ కేటగిరి సెక్యూరిటీ మెండుగా ఉండేది. కానీ ఇపుడు పరిస్థితి తారుమారైంది. అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండటంతో జిల్లాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌కు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు, అభిమానులు ఒక్కసారిగా మీద పడిపోవడంతో నియమించుకున్న సెక్యూరిటీ అదుపు చేయలేక చాలా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అయన చాలా అసహనానికి గురవుతున్నట్లు సమాచారం.

ఈ గడ్డు పరిస్థితుల్లో అధినేతను ఎలా సంతృప్తి పర్చాలో తెలియక ముఖ్యమైన నేతలు తలలు పట్టుకుంటున్నారట. రైతన్న సమస్యలపై పోరాటం, కేడర్‌లో జోష్ నింపేందుకు సభలు నిర్వహిస్తున్నవేళ అధినేత కెసిఆర్ చాలా తిప్పలు పడుతున్నాడట పాపం. దానికి తోడు కాలి గాయం కూడా ఒకింత ఇబ్బంది పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత నెల 31న గులాబీ అధినేత కేసీఆర్ పర్యటించారు. తిరిగి వస్తుండగా ఫాం హౌజ్‌కు చేరే దాకా తీవ్ర ఇబ్బంది పడినట్లు సమాచారం. దాంతో ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్, 13న చేవెళ్ల సభ, 15న మెదక్ ఇలా వరుసగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని తెలిసిన లీడర్లు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం.

అదే కెసిఆర్ పవర్‌లో ఉన్నపుడు 5 మీటర్ల దూరంలోనే కార్యకర్తలు జనాలను పోలీసులు పరిమితం చేస్తుండేవారనే విషయం అందరికీ తెలిసినదే. నల్గొండ జిల్లా పర్యటనలోనే సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకెంత ఇబ్బందులకు తన అధినేతను గురు చేస్తారో అని గులాబీ కార్యకర్తలు చాలా అసహనంగా ఉన్నారట. ఈ క్రమంలోనే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తమ అధినేతకు కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. అంతేకాదండోయ్... అధినేత కేసీఆర్‌కు సెక్యూరిటీ.. మాకు చావు కాలం వచ్చిందని నేతలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నట్టు భోగట్టా. ఏదీ ఏమైనా ఈ సమయంలో కేసీఆర్‌కు సెక్యూరిటీ కల్పన నేతలకు తలనొప్పిగా మారినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: