ఎన్నికల సమయంలో ఏపీలో విపక్ష పార్టీలలో కుదుపులు మొదలయ్యాయి. అయితే ఇటువంటి సమయంలో నేతలు పార్టీలు మారడం అనేది చాలా కామన్ విషయమే అయినప్పటికీ కీలక నేతలు కండువాని మార్చినపుడు మాత్రం అది సదరు పార్టీకి చాలా మైనస్ పాయింట్ అవుతుంది అనేది నిర్వివాదాంశం. అందుకే సో కాల్డ్ నాయకులు అటువంటి నేతలు చేయి జారిపోకుండా వారిని సంతృప్తి చేస్తూ వుంటారు. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి భారీ గండి పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తోన్న తెలుగుదేశం పార్టీ.. పొత్తుల్లో భాగంగా కొందరు నేతలకు సీట్లు ఇవ్వలేకపోయింది. మరికొన్ని స్థానాల్లో సీటు ఆశించినవారికి భంగపాటు తప్పలేదు మరి.

ఈ క్రమంలోనే వాళ్లను కాదని మరో నేతకు సీటు కేటాయించడం ఆ పార్టీలో చిచ్చు లేపింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కర్నూలు జిల్లాలో టీడీపీకి గట్టిగా దెబ్బ పడే అవకాశం మెండుగా కనబడుతోంది. విషయం ఏమిటంటే పార్టీలో కీలక నేతలుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. అవును, ఈ నెల 12వ తేదీన పలువురు టీడీపీ నేతలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని గట్టిగా వినబడుతోంది. మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆలూరు మాజీ టీడీపీ ఇంఛార్జ్‌ వైకుంఠం మల్లికార్జున, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్ వినబడుతోంది.

ఈ నేపథ్యంలోనే, వారంతా ఆల్రెడీ జగన్ తో మంతనాలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు మంత్రాలయం టికెట్ దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట తిక్కారెడ్డి. ఇదే విషయమై ఆయన పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబుతో చర్చించినా చర్చలు ఫలించలేదు. అందుకే మంత్రాలయం అసెంబ్లీ టికెట్ పై ఇప్పటికీ తిక్కారెడ్డి పట్టు వీడడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. తిక్కారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయానికి వస్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. మరి ముఖ్యమైన నేతల వలసలకి టీడీపీ చెక్‌ పెడుతుందా? లేదా అన్న విషయం చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: