మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొత్త‌ప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్‌.. టీడీపీపై అల‌క వీడారు. పార్టీతో క‌లిసి ప‌నిచేసేందుకు ఆయ‌న ఉత్సాహంగా ముందుకు వ‌చ్చారు. మ‌రి ఆయ‌న‌ను చంద్ర‌బాబు ఎలా ఒప్పించారు?  ఆయ‌న‌ను ఎలా దారికి తెచ్చారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ, దీనిని చంద్ర‌బాబు ఇవ్వ‌లేదు.


ఫ‌లితంగా తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన జ‌వ‌హ‌ర్‌.. ఒకానొక ద‌శ‌లో వైసీపీలోకి వెళ్లిపోవాల‌ని కూడా ప్ర‌య త్నించారు. మ‌రో ద‌శ‌లో .. ఒంట‌రిగా పోటీ చేయాల‌ని.. చంద్ర‌బాబు, నారా లోకేష్ ఫొటోలు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న బ‌హిరంగంగా కూడా చెప్పేశారు. తాను పోటీ చేయ‌డం త‌థ్య‌మ‌న్నారు. అది కూడా కొవ్వూరు నుంచే అని జ‌వ‌హ‌ర్ వెల్ల‌డించారు. దీంతో టీడీపీలో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.


కొంద‌రు నాయ‌కులు రంగంలోకి దిగి జ‌వ‌హ‌ర్‌కు న‌చ్చ‌జెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మెత్త‌బ‌డ‌లేదు. అయితే.. ఆర్థిక ప‌రిస్థితి పెద్ద‌గా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. బ‌ల‌మైన రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆయ‌న‌కు అండ‌గా ఉంటుందా? ఉండ‌దా? అనే సందేహాలు కూడా రావ‌డంతో కొంత మెత్త‌బ‌డ్డారు. ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా జ‌వ‌హ‌ర్ విష‌యంలో సానుకూలంగా స్పందించారు. ప్ర‌స్తుతం తిరువూరులో ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ టీడీపీ టికెట్ ద‌క్కించుకున్న కొలిక‌పూడి శ్రీనివాస్‌రావు.. వ్య‌వ‌హారం ఇబ్బందిగా మారింది.


దీంతో ఆయ‌న‌ను త‌ప్పించి.. జ‌వ‌హ‌ర్‌కు టికెట్ ఇచ్చే అంశంపై చ‌ర్చ సాగుతోంది. అయితే.. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ, చంద్ర‌బాబు మాత్రం జ‌వ‌హ‌ర్‌ను మెత్త‌బ‌రిచారు. తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు రెండు రోజుల కింద‌టే జ‌వ‌హ‌ర్‌తో ప్ర‌త్య‌క్షంగా మాట్లాడారు. ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ఎమ్మెల్సీ లేదా.. ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను ఇస్తామ‌ని చెప్పారు. ఆర్టీసీ చైర్మ‌న్‌గా గ‌తంలో వ‌ర్ల‌కు అవ‌కాశం ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. పార్టీని బ‌ల‌ప‌ర‌చాల‌ని సూచించారు. దీనికి జ‌వ‌హ‌ర్ ఓకే చెప్పారు. ప‌లితంగా గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఉమ్మ‌డి స‌భ‌ల్లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: