•అంబటి రాంబాబుకి అదే ప్లస్ కానుందా..
•కన్నాకు టికెట్ ఇవ్వడం వారికి నచ్చడం లేదా
•కోడెల సహకారం లేనిదే కన్నా గెలవలేరా..రాజకీయాలలో ఇద్దరూ సీనియర్ నేతలే.. ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. గట్టి వాయిస్ ఉన్నవాళ్లు.. ఇన్ని రోజులు వేరువేరు చోట్ల పోటీ చేసిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే సీటు నుంచి ఎన్నికలలో పోటీకి దిగబోతున్నారు. ఆ ఇద్దరిలో పై చేయి ఎవరిది కాబోతోంది.. ? రాజకీయ కుమ్ములాటలలో ముంచేది ఎవరిని..?  గెలిపించేది ఎవరిని.. ? పల్నాడు లోని కీలక నియోజకవర్గాన్ని అధికార పార్టీ నిలబెట్టుకుంటుందా? లేక తన పాత అడ్డాను ప్రతిపక్షం తిరిగి దక్కించుకుంటుందా? తెలియాలి అంటే ఈ ప్రత్యేక కథనం మీకోసం..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి అంబటి రాంబాబు వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాలలో హీట్ పెంచేస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి నేత కోడెల శివప్రసాద్ రావు చేతిలో అత్యంత తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన అంబటి రాంబాబు.. 2019లో గెలుపొంది సత్తా చాటారు.. వైయస్ జగన్ నేతృత్వంలో కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు కొనసాగారు. 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంబటి రాంబాబు. 1994, 1999 ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. 2004,  2009లో కూడా ఆయన పోటీ చేయలేదు. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసినా పరాభవమే ఎదురయింది. కానీ 2019లో విజయం సాధించారు.

టిడిపి నుంచి బరిలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో గుంటూరు వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల నాటికి బీజేపీలో చేరి నరసరావు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినా విజయం లభించలేదు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంతటి గొప్ప రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడుతుండడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 1983 నుంచి ఇప్పటివరకు సత్తెనపల్లి లో టిడిపి 3 సార్లు మాత్రమే గెలిచింది. 1983లో నన్నపనేని రాజకుమారి, 1999లో వైవి ఆంజనేయులు, 2014లో కోడెల శివప్రసాదరావు మాత్రమే టిడిపి తరఫున విజయం సాధించారు.

ఇప్పుడు మళ్లీ కన్నా బరిలోకి దిగుతుండడంతో సత్తెనపల్లి మళ్లీ తమ వశం అవుతుందని టిడిపి గట్టి ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా ఒకప్పుడు పెదపురపాడు లో ఉన్న రాజుపాలెం మండలం ఇప్పుడు సత్తెనపల్లిలో ఉండడం కన్నాకు బాగా కలిసొచ్చే అంశం.. అంబటి రాంబాబును ఢీకొట్టేందుకు కన్నానే కరెక్ట్ కాండేట్ అని టిడిపి నమ్ముతోంది. మరోవైపు టిడిపిలో మూడు గ్రూపులు ఉండగా శివరాం ప్రసాద్ , మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు , యువనేత అబ్బూరి మల్లి ఎవరికి వారు గ్రూపులు మెయిన్టైన్ చేస్తూ.. టికెట్ కోసం పోట్లాడుతున్నారు.. కానీ టిడిపి అధినేత సైలెంట్ గా కన్నాను బరిలోకి దింపడం వీరిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వీరి సహాయ సహకారాలు కన్నాకు ఏ విధంగా ఉపయోగపడతాయో చూడాలి. మరొకవైపు కోడేల శివరాం ప్రసాద్ ఎలాగైనా సరే చివరి నిమిషంలోనైనా టిడిపి అధినేత తనకు టికెట్ ఇస్తారని.. ఆశ పెట్టుకున్నప్పటికీ అవకాశం లేకుండా పోయింది. పైగా  కోడేల శివరాం ప్రసాద్ కి కొన్ని మండలాలలో భారీ పట్టు ఉంది. ఒకవేళ ఆయన సపోర్టు ఇవ్వకపోతే కన్నా పరిస్థితి అయోమయంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మొత్తానికైతే ఈ అంశాలు అటు అంబటి రాంబాబుకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: