- గూడెంలో మంత్రి కొట్టుకు జ‌న‌సేన బొలిశెట్టి నుంచి గ‌ట్టి పోటీ..?
- తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్న కొట్టు...?
- దేవాదాయ శాఖా మంత్రికి ఓట‌మి గండం త‌ప్పించుకునేనా ?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఏపీ రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక కూడా ఓ సెంటిమెంట్ ఉంది. దేవాదాయ శాఖా మంత్రులుగా ఉన్న వాళ్లంతా ఎన్నిక‌ల్లో ఓడిపోతూ వ‌స్తున్నారు. అలాగే స్పీక‌ర్లు గా ఉన్న వాళ్లు కూడా ఎక్కువుగా ఓడిపోవ‌డం కామ‌న్ అయ్యింది. అయితే గ‌త తెలంగాణ ఎన్నిక‌ల్లో స్పీక‌ర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఈ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసి విజ‌యం సాధించారు. అది ప‌క్క‌న పెట్టేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం తాడేప‌ల్లిగూడెంలో గెలుస్తారా ? ఆయ‌న దేవాదాయ శాఖా మంత్రి ఎన్నిక‌ల్లో ఓడిపోతార‌నే బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా ? ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి త‌న సిట్టింగ్ సీటు నిలుపుకుని.. గూడెం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి కొట్టు ప్ర‌త్య‌ర్థి విష‌యంలో కొత్త చేంజ్ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి బొలిశెట్టి శ్రీను, టీడీపీ నుంచి ఈలి నాని పోటీ చేశారు. ఈ సారి పోత్తులో భాగంగా గూడెం సీటు జ‌న‌సేన ద‌క్కించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గ‌ణ‌నీయ‌మైన ఓట్లు తెచ్చుకున్న బొలిశెట్టి శ్రీను ఈ సారి టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తులో భాగంగా మంత్రి కొట్టుపై పోటీ చేస్తున్నారు.


బొలిశెట్టి గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో తాడేప‌ల్లిగూడెం మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లోకి వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూట‌మిలో భాగంగా బొలిశెట్టి జ‌న‌సేన నుంచి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా ఉన్నారు. కొట్టు 2004 త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో గెలిచి అనూహ్యంగా దేవాదాయ శాఖా మంత్రి అయిపోయారు. మంత్రి అయ్యాక ఆయ‌న శాఖ‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి హెచ్చుమీరిపోయింద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. మెజార్టీ కేడ‌ర్ కూడా ఆయ‌న్ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.


దీనికి తోడు 2009లో ఉమ్మ‌డి జిల్లాలో ప్ర‌జారాజ్యం గెలిచిన ఏకైక సీటు కావ‌డంతో పాటు ప‌వ‌న్‌, కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. కొట్టు, అటు బొలిశెట్టి కూడా కాపు నేత‌లు కావ‌డంతో గూడెంలో జ‌న‌సేన బ‌లంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన చాలా బ‌లంగా క‌నిపిస్తోంది. అటు రూర‌ల్ మండ‌లాల్లో తెలుగుదేశం అభిమానులు, క‌మ్మ వ‌ర్గం ఎక్కువ‌. ఇక 2014 లో ఇక్క‌డ బీజేపీ గెలిచింది. బీజేపీకి కూడా చెప్పుకోద‌గ్గ ఓట్లు ఉన్నాయి. ఈ ముగ్గురు క‌ల‌వ‌డంతో పాటు కొట్టుపై ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో కొట్టు ఏటికి ఎదురీదుతోన్న మాట వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: