శనివారం రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పదునైన వస్తువుతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగన్ పై జరిగిన దాడిని రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ వ్యవస్థ పనితీరు విషయంలో సైతం కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే విజయవాడలోని సింగ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో బెజవాడ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీలో కొన్నేళ్ల క్రితం వరకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో విజయవాడ ముందువరసలో ఉండేది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత విజయవాడ ప్రాంతంలో భూముల ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అమరావతిని కొంతమేర అభివృద్ధి చేశారు. అయితే బెజవాడ ప్రాంతంలో ఎలాంటి చెడు ఘటన జరిగినా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు.
 
ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎలాంటి తప్పు చేయకపోయినా వాళ్లే తప్పు చేశారేమో అనే విధంగా ప్రచారం జరుగుతోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు ఈ పరిస్థితి లేదని విజయవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొన్నేళ్లలోనే బెజవాడలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. బెజవాడలో రాజకీయ కుట్రలు జరుగుతుండటం ఇక్కడి ప్రజల్లో ఒకింత భయాందోళనకు కారణమవుతోంది.
 
సీబీఐ, ఎన్.ఐ.ఏ వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపిస్తే మాత్రమే జగన్ పై జరిగిన దాడిలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సీఎం పర్యటన సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలమంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ డ్రామాకు తెర లేపారని కొంతమంది టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగే సమయానికి జగన్ పై దాడి కేసులో నిందితులు దొరుకుతారో లేదో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: