- టీడీపీ కొత్త అభ్యర్థిని పలుచన చేసే ఎత్తుగడలు
- విజయం ఏకపక్షమన్న ఫీలర్లతో ఓటర్లతో మైండ్‌గేమ్‌
- గొండు శంకర్ దూకుడుతో లోప‌ల టెన్ష‌న్ టెన్ష‌న్‌
- పైకి ఈజీ అంటూనే లోప‌ల కుటుంబంతో చెమ‌టోడుస్తోన్న మంత్రి


( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
గొండు శంక‌ర్ అస‌లు నాకు పోటీయే కాదు.. అత‌డిది ఓ స‌ర్పంచ్ స్థాయి.. నాకు పోటీయే కాదు.. మ‌నం 15 వేల పై చిలుకు మెజార్టీతో గెలుస్తున్నాం.. ప్ర‌శాంతంగా ఉండండి అంటూ బీరాలు పోయిన మంత్రి, శ్రీకాకుళం వైసీపీ అభ్య‌ర్థి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇప్పుడు ప్ర‌చారం కోసం త‌న కుటుంబం మొత్తాన్ని రంగంలోకి దింపి గెలుపు కోసం చెమ‌ట‌లు క‌క్కుతున్నారు. 1985 తర్వాత తొలిసారి టీడీపీ టికెట్‌ గుండ కుటుంబాన్ని కాదని బయటి నేతకు దక్కింది. అది కూడా ఒక యువకుడికి. అదే ఇప్పుడు సమస్యగా, అర్థంకాని విధంగా తయారైంది సిక్కోలు జ‌నాల‌కు.


ఇప్పుడు ధ‌ర్మాన‌కు ఉన్న ఆశ ఏంటంటే టీడీపీ నుంచి గుండ లక్ష్మీదేవికి టికెటివ్వనందున ఆమెతో ఉన్న టీడీపీ క్యాడర్‌ తనకోసమే పని చేస్తుందన్న‌దే. లోప‌ల గెలుపు భ‌యం ఉన్నా తన క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు శంకర్‌ అసలు తనకు పోటీయే కాదని చెప్పుకొస్తున్నారు. ఇక శ్రీకాకుళంలో కౌన్సెల్ ప‌ద‌వీ కాలం 2010లోనే ముగిసింది. 14 ఏళ్ల పాటు ప‌ట్ట‌ణంలో ర‌క‌ర‌కాల ప‌ద‌వుల‌కు దూరంగా ఉన్న వారంతా ఇప్పుడు ధ‌ర్మాన‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు.


ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న శంక‌ర్ గత రెండున్నరేళ్లుగా శంకర్‌ రూరల్‌, గార మండలాల్లోనే విస్తరించారు. నగరంలో సత్తా చాటడానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనే ఒక పదవి లేకపోవడం వల్ల లక్ష్మీదేవి నివాసముంటున్న ప్రాంతంలో ప‌ట్టు సాధించ‌లేక‌పోవ‌డం ఒక్క‌టే ఆయ‌న‌కు మైన‌స్‌. అందుకే న‌గ‌రంలో శంక‌ర్ కాస్త వీక్‌గా క‌నిపిస్తున్నా ఎన్నిక‌ల టైంకు పుంజుకుంటార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక అర్బ‌న్ ఓట‌రు ప్ర‌భుత్వ పాల‌న‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక భావంతో ఉన్నారు. ఇది త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న ధీమాతో శంక‌ర్ ఉన్నారు.


2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ధర్మాన తన క్యాంప్‌ కార్యాలయానికి అంటించిన నోటీసు ఇప్ప‌ట‌కీ ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు. వ్యక్తిగత పనుల కోసం, బదిలీల కోసం, సిఫార్సు లేఖల కోసం తన వద్దకు రావద్దంటూ తాటికాయంత అక్షరాలతో ఆ నోటీసు పెట్టారు. ఆ తర్వాత రెండున్నరేళ్లకు మంత్రి అయ్యాక గ‌న్‌మెన్ల‌ను ముందు పెట్టించి గేటును క్లోజ్ చేసి ప‌డేశారు. ఇటు ఆర్థిక వ్య‌వ‌హారాలు, వ్యాపారాలు చేసుకునే వారికే లోప‌లకు ప్ర‌వేశం ఉండేద‌న్న టాక్ బ‌య‌ట‌కు స్ప్రెడ్ అవ్వ‌డంతో ధ‌ర్మాన పాత పేరు మొత్తం పోయింది.


వ్య‌క్తిగ‌తంగా ధ‌ర్మాన ఛ‌రిష్మా ముందు టీడీపీ శంక‌ర్ సరితూగ‌లేక‌పోవ‌చ్చు. కానీ శ్రీకాకుళం ఓటర్లు ఎప్పుడూ సైకిల్‌ సింబల్‌తోనే ఉన్నారు. లక్ష్మీదేవికి తప్ప టికెట్‌ ఎవరికి ఇచ్చినా పనిచేసేది లేదని చెప్పుకొచ్చిన అనేకమంది ఆమె అభిమానులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ నిర్ణయానికి క‌ట్టుబ‌డుతున్నారు. ఏదేమైనా కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడిగా ఉన్న ధ‌ర్మాన జూనియ‌ర్ శంక‌ర్‌పై గెలిచేందుకు ఆప‌సోపాలు ప‌డుతోన్న మాట వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: