గత కొన్ని రోజులుగా రఘురామ కృష్ణం రాజు పోటీ చేసే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఏదైనా నరసాపురం ఎంపీ అభ్యర్థి తానేనంటూ అనే స్థాయిలో మాట్లాడారు. ఈమేరకు ఓ బహిరంగా సభలో ప్రకటించారు కూడా. తీరా చూస్తే ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ సమయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.


దీంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా వాటికి బలం చేకూరుస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉండి నియోజక వర్గ నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రామరాజును తప్పిస్తారనే కథనాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తాను ఉండి నుంచి పోటీ చేస్తానని చెప్పలేదంటూనే.. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు.


తాను ఏనాడు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అనలేదు. కానీ పోటీ చేసి చట్టసభల్లో ఉంటానని మాత్రమే తెలిపాను. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయంలో స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఉండి తన సొంత నియోజకవర్గం అని తాను ఉండిలోనే నివాసం ఉంటున్నానని తెలిపారు. ప్రస్తుత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ రాజు మాత్రం భీమవరంలో నివాసం ఉంటున్నారని చెప్పే ప్రయత్నం చేశారు.


ఏది ఏమైనా తాను పోటీలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ఇదే సమయంలో ఉండి లో జూదగాళ్లు, గ్యాంబ్లర్లు ఈయనే ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు కానీ.. రాష్ట్రంలో ప్రజలు మాత్రం తననే ఉండాలని కోరుకుంటున్నట్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో 40మంది గ్యాంబర్ల కోరికా.. లేక రాష్ట్రంలోని ప్రజల కోరికా అనేది చంద్రబాబుకి క్లారిటీ ఉందన్నారు. అయితే దీనిపై విశ్లేషకులు స్పందిస్తూ... అసలే గడ్డుకాలం. ఈ సమయంలోనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే ఆయనకు ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: