బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..అనే సామెత ఊరికే రాలేదు. పది సంవత్సరాలు ఏకధాటిగా  చక్రం తిప్పిన కేసీఆర్ ఒక్కసారిగా డీలాపడిపోయాడు. తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా పేరు తెచ్చుకున్న ఆయన  ప్రస్తుతం పార్టీ అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ వేళ జిల్లాలలో అభ్యర్థులను నిలబెట్టేందుకే  తలామునకలవుతున్నట్టు తెలుస్తోంది. 2014, 2019  ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్  కనీసం తెలంగాణలో ప్రతిపక్షం అనే మాటకు విలువ లేకుండా చేసింది. నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా పాలన అందించింది. ఇంతటి స్థాయిలో ఎదిగినటువంటి ఈ పార్టీకి ప్రస్తుతం మనుగడ కరువవుతోందట. 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి  రాగానే  రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. పూర్తిగా బీఆర్ఎస్ చతికిల పడిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఎదిగినటువంటి కీలకమైన లీడర్లు పార్టీ కష్ట సమయంలో సపోర్టుగా ఉండాల్సింది పోయి పార్టీ నుంచి ఎప్పుడు జంప్ అవుదామా అని ఎదురు చూస్తున్నారట. అంతేకాకుండా పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఇక ఇదే అదనుగా చూసినటువంటి బీజేపీ ఒకప్పటి బీఆర్ఎస్ స్థానాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో దూసుకెళ్తోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో  పూర్తిస్థాయిలో సీట్లు తీసుకొచ్చుకోవాలని భావిస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 సీట్లు గెలవగా, బిజెపి నాలుగు, కాంగ్రెస్ మూడు గెలిచింది. ఇక హైదరాబాదులో ఎంఐఎం విజయం సాధించింది. ఇక బిజెపి  నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, సికింద్రాబాద్ లో  ఎంపీ స్థానాలను దక్కించుకుంది.  అయితే ఈసారి మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని బిజెపి ప్రధాన ఎత్తుగడ వేసింది. 2019 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు అయితే సాధించిందో ఆ సీట్లన్ని బిజెపి వైపు మలుపుకునేలా  వ్యూహాలు రచిస్తుందట. ఇదే తరుణంలో  అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈసారి పూర్తిస్థాయిలో  లోక్ సభలో 15 ఎంపీ స్థానాలను గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీ మధ్య కీలకమైన పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం  అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: