రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ది ఓ విచిత్ర శైలి. జీరో పాలిటిక్స్ అనే అంశంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. సామాన్యులకే రాజ్యాధికారం అనేది తన ఆశయం అని పార్టీ స్థాపించిన తొలినాళ్లలో చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని జనసైనికులతో పాటు సామాన్యులు కూడా నమ్మారు. తీరా.. 2024 ఎన్నికలకు వచ్చే సరికి పవన్ కి జ్ఞానోదయం అయింది.


డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయం చేయడం అంటే కుదరదు. ఎన్నికల సంఘం కూడా రూ.45 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని పరిమితి విధించిందని గుర్తు చేశారు. ఓట్లు కొనలేని రాజకీయం వస్తే మంచిదే కానీ.. ప్రస్తుత దేశంలో అలాంటి పరిస్థితి లేదు కదా అని ప్రశ్నించారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయమని తాను ఎప్పుడూ చెప్పను అంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు జీరో పాలిటిక్స్ అని గొప్పగా చెప్పుకునే నేతలకు ఈ వ్యాఖ్యలు షాకింగ్ లా మారాయి.


ప్రస్తుతం పవన్ పిఠాపురం నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని చూసి మరీ ఎంచుకున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల పాటు నియోజవర్గంలో పర్యటించి.. స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. అక్కడ తన గెలుపు బాధ్యతను టీడీపీ ఇన్ ఛార్జి వర్మకు అప్పగించారు.


ఇదిలా ఉండగా.. పవన్ పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని జైభీం పార్టీ అభ్యర్థి జగ్గారపు మల్లిఖార్జున పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. జనసేనాని విచ్చలవిడిగా రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం, మతం ప్రాంతం ఆధారంగా పవన్ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అంటూ.. చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం అని సంచలన ఫిర్యాదే చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: