ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం కీలక ప్రకటన చేశారు. తాను విశాఖపట్నం ఎంపీగా, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను విశాఖపట్నం ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. తనను ఎంపీగా గెలిపిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటులో పోరాడుతానన్నారు. ఇక రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై తాను గళం ఎత్తుతానన్నారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 3 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారిలో ప్రజల గురించి పని చేసే మంచి వారిని ఎంపిక చేసి, వారికి ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్లు ఇస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు. ఇక ప్రజాశాంతి పార్టీకి చెందిన ఎన్నికల ప్రచార గీతాన్ని పార్టీ నేతలు ఏసుపాదం, జీలకర్ర రవికుమార్ సమక్షంలో ఆయన విడుదల చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాను గతంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 5 కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలకు సంబంధించినదన్నారు. దీనిని విక్రయిస్తుంటే రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక విక్రయ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకునే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత స్పష్టం చేశారు. గతంలో తాను నిరాహార దీక్ష చేపట్టినప్పుడు విరమించాల్సిందిగా పలువురు మంత్రులు తనకు ఫోన్ చేశారన్నారు. అయినప్పటికీ దీక్ష కొనసాగించానన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ విక్రయించే ప్రణాళికలను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపిలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని గతంలో తాను పిలుపునిచ్చానన్నారు. అయితే ఏపీలోని రాజకీయ నేతలు దీనికి ముందుకు రాలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ రూ.8 లక్షల కోట్లు అయితే కేంద్రం రూ.4 వేల కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిని ఆపేందుకు తనను ఎంపీగా గెలిపించాలని విశాఖ ప్రజలను ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: