ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. ఒకప్పడు జిల్లా రాజకీయాలను శాసించిన టీజీ ఫ్యామిలీ మరో సారి ఎన్నికల బరిలోకి దిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ గత ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం టీడీపీలో ఉన్నారు. ఓ వైపు రాజకీయంగా బలమైన ఫ్యామిలీ కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతో టీడీపీ ఆయనకు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. సర్వేల్లోనూ ఆయనకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. దీంతో ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. తాజాగా శుక్రవారం కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో సైకిల్‌పై ప్రచారం నిర్వహించి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. “సైకిల్” టీడీపీ గుర్తు అంటూ స్థానికంగా సైకిల్ ప్రచారానికి శ్రీకారం చుట్టి టీజీ భరత్ వినూత్న రీతిలో పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీజీ భరత్ సైకిల్ ర్యాలీ ఎస్ఏపీ క్యాంపు వద్ద ప్రారంభమై కొత్త బస్టాండ్ ప్రాంతం, ఇందిరా గాంధీ నగర్, సీతారాం నగర్, బంగారుపేట ప్రాంతాల మీదుగా మౌర్య ఇన్ జంక్షన్ వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆయన తన రాజకీయ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా ఉన్న నియోజకవర్గం అభివృద్ధి పరంగా శరవేగంగా ముందుకు సాగుతుందని టీజీ భరత్ పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. గత ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గాన్ని పూర్తిగా పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఈ వేసవిలో కర్నూలు నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడానికి అధికారుల ఉదాసీనత కారణమని ఆరోపించారు. "సమస్య తీవ్రత ఏమిటంటే, అనేక కాలనీలకు వారానికి ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిని తగ్గించడానికి అధికార పార్టీ లేదా అధికారులు ఏమీ చేయలేదు" అని భరత్ విచారం వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్తు అంతరాయాలు కూడా నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు సంబంధించిన స్థానిక సమస్యలన్నింటినీ దీర్ఘకాలిక దృక్పథంతో పరిష్కరిస్తానని టీడీపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: