లోక్ సభ సీట్ల పరంగా దక్షిణాన అతి పెద్దదైన తమిళనాడులో మొదటి దశలోనే ఓటింగ్ ముగిసింది.  ఈ ద్రవిడ నాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ద్విముఖ పోటీ నెలకొంటూ ఉంటుంది. ఈ సారి అన్నాడీఎంకే బలహీన పడగా.. ఆ స్థానాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఆ పార్టీని పక్కన పెట్టి బీజేపీ వేరు కుంపటి పెట్టి మిగతా పార్టీలతో ఎన్నికలకు వెళ్లింది.


గత ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి 38 సీట్లను కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో ఆ పార్టీకి అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు కూడా రెండు అంకెలకు చేరుకుంటుందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.


ఈసారి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది. దీంతో దక్షిణాన పట్టు సాధించాల్సిన పరిస్థితి. అందుకు  అనుగుణంగా మోదీ కూడా పలు పర్యటనలు, డీఎంకే పై విమర్శలు చేస్తూ.. బీజేపీ గ్రాఫ్ ని పెంచారు. అయితే ద్రవిడ నాడ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా లోక్ సభ ఎన్నికల్లో ఇవ్వడం ఆనవాయితీ. ఇది తమకు లాభిస్తుందని అన్నామలై.. మోదీలు భావించారు.


ప్రస్తుతం అక్కడ పోలింగ్ ముగిసింది. ఇప్పుడే ట్రెండ్స్ అర్థం కాకపోయినా బీజేపీ చీఫ్ అన్నామలై మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయనకు ఎన్నికల సరళి అర్థమై ఉంటుందని.. అందుకే చేతులెత్తేశారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి అంచున ఉన్నవారే కారణాలు ఎదుర్కొంటారని.. ఇప్పుడు అన్నామలై చేసేది అదే అని వివరిస్తున్నారు.


అన్నామలై ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే, ఏఐడీఎంకే రూ.1000 కోట్లు ఖర్చు చేశాయని.. పలు చోట్ల ఓటర్లను తొలగించారని..రీపోలింగ్ నిర్వహించాలని పలు రకాల వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ఉండగా ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఓటమి అంగీకరించినట్లే అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: