ఏపీలో ఎన్నికల పోరాటం జోరుగా సాగుతోంది. అధికారం నిలబెట్టుకోవాలని జగన్... ఎలాగైనా జగన్‌ను గద్దె దింపాలని చంద్రబాబు, పవన్‌ కృషి చేస్తున్నారు. 75 ఏళ్ల వయస్సుకు చేరిన చంద్రబాబుకు ఇవి ఒక విధంగా చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవకపోతే.. ఇక ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఏపీ ప్రజల నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు.


మళ్లీ జగన్‌నే గెలిపిస్తారా.. లేక తెలంగాణ మాదిరిగా మార్పునకు ఓటేస్తారా అన్న విషయం అంతుబట్టట్లేదు. తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వేవ్‌ కనిపించింది. కానీ ఏపీలో ఓటరు మాత్రం ఇంకా బయటపడట్లేదు. గుంభనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక సర్వేలకు, విశ్లేషణలకు డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏపీలో రాజకీయ పరిస్థితులపై టీవీ9 ఇంటర్వ్యూలో స్పందించారు.


ఏపీ రాజకీయాలు చూస్తున్నారు కదా.. అక్కడ ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తోంది.. దీనిపై మీరేమంటారని రజినీకాంత్‌ అడిగితే.. కేసీఆర్‌ తన జోస్యం వివరించారు. ఏపీ రాజకీయాలపై తమకు అంత ఆసక్తి లేదంటూనే.. ఏపీలో ఈసారి మళ్లీ జగనే వస్తారని మాకు సమాచారం అందుతోందని చెప్పారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు పెద్దగా తేడా లేదన్న కేసీఆర్‌.. తమకు అందుతున్న సమాచారం మాత్రం జగనే గెలుస్తారని చెబుతున్నారని వివరించారు.


ఇదే సమయంలో రజినీకాంత్‌ మరో ప్రశ్న అడిగారు.. ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మీకు జగన్ రావాలని ఉందా.. చంద్రబాబు రావాలని ఉందా.. అంటూ ఇరుకున పెట్టే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ కూడా తన అనుభవంతో చాకచక్యంగా ఎటూ చెప్పకుండా తప్పించుకున్నారు. ఈ ప్రశ్నకు ఓ రాజకీయ నాయకుడిగా నేను బహిరంగంగా చెప్పకూడదని దాటవేశారు. తమకు ఉన్న సమాచారం మేరకు మళ్లీ జగన్‌ రాబోతున్నాడని మాత్రం స్పష్టంగా చెప్పేశారు. చూడాలి. మరి కేసీఆర్‌ జోస్యం నిజం అవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: