ఏపీలో ఎన్నికల నగారా మోగిన నాటినుండి ఎన్నికల హడావుడి మొదలయింది. విపక్షాలు తమదైన రీతిలో ప్రచారాలు చేపట్టాయి. ఇక ఈ క్రమంలో కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీలు మధ్య సీట్ల పంపకంలో ఒకింత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయనేది నిర్వివాదాంశం. దానికి తాజా ఉదాహరణే కాకినాడ జిల్లా సీట్ల పంపకంలో జరిగిన ఓ సంఘటన. విషయం ఏమిటంటే తనకు అత్యంత సన్నిహితుడైన తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను ఏరికోరి మరీ కాకినాడ ఎంపీ అభ్యర్థిని చేశారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడా అభ్యర్థిత్వమే పవన్‌కు పెద్ద తలపోటుగా మారిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ నుంచి వారాహి యాత్ర వరకూ అన్నీ తానై చూసుకున్న శ్రీనివాస్‌కు పవన్‌ కల్యాణ్‌ తొలుత జనసేన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే.

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు క్లారిటీ రావడంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసుని ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఈ విషయం శ్రీనివాస్ ని బాగా బాధించిందని సమాచారం. ఇకపోతే పిఠాపురంలో వ్యవహారం అంతా కూడా చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరుగుతోందని, తమను కాదని పవన్‌ ఇక్కడ ఏ నిర్ణయమూ తీసుకోలేరని గుసగుసలు వినబడుతున్నాయి. దానికి ఇపుడు ఉదయ్‌ శ్రీనివాస్‌ సంఘటనే కారణం అని తెలుస్తోంది. జనసేన నుంచి ఉదయ్‌ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం టీడీపీ సరికొత్త రాజకీయానికి తెర తీసినట్టు కనబడుతోంది.

ఇపుడు ఇదే అంశం జనసేన కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. మరోవైపు పట్టుమని పది మందితో కూడా పరిచయం లేని శ్రీనివాస్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిని చేసేయడమేమిటని టీడీపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులు వాదనకి తెరలేపుతున్నారు. ఈ రాజకీయమంతా బాబుగారే స్వయంగా లేపుతున్నట్టు విశ్లేషకులు అనుకుంటున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం, కాకినాడ రూరల్‌ నుంచి జనసేన పోటీ చేస్తోంది. మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉదయ్‌ శ్రీనివాస్‌ను మార్చాలని గట్టిగా పట్టు బడుతున్నట్టు కనబడుతోంది. ఉదయ్‌ శ్రీనివాస్‌ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడైన సానా సతీష్‌ను తెర మీదకు తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు ఇదే అంశం పవన్ కి నచ్చలేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: