తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. అన్ని లోక్‌సభ నియోజక వర్గాలలో గెలుస్తామని ధీమాగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజక వర్గాల్లో చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన భావిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో ఫలితం మరోలా ఏంది. చేవెళ్ల, మల్కాజిగిరిలో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. సికింద్రాబాద్‌లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. అక్కడ కూడా సూరత్ తరహా ఫలితం ఎదురుకానుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో 2024 లోక్‌సభ ఎన్నిక‌ల్లో సూరత్ లోక్‌సభ నియోజకవర్గం అందరినీ ఆకర్షిస్తోంది. ఒక్కసారిగా ఈ నియోజకవర్గం చాలా పాపులర్ అయింది. ఎన్నికల ఫలితం జూన్ 4న విడుదల అవనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సూరత్‌లో మాత్రం ఫలితం ముందే వచ్చేసింది. అక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతకు ముందు అక్కడ జరిగిన పరిణామాలు అందరినీ నివ్వెరబోయేలా చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురవడం, డమ్మీ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరణ కావడం, ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ తిరుగులేకుండా ఎన్నిక లేకుండా అక్కడ గెలిచింది. అయితే అలాంటి పరిణామం సికింద్రాబాద్‌లోనూ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి ఇక్కడ పోటీ లేకుండా పోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఆ పార్టీకి స్వతహాగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్ అసలు గెలుపు అవకాశాలపై ఏ మాత్రం ఆశ లేకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రచారం చూసి అసలు కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నారా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా తీగల పద్మారావు గౌడ్‌ను రంగంలోకి దిగింది. ప్రజల్లో ఉండే అభ్యర్థి, సౌమ్యుడు కావడంతో ఆయన కూడా ఓటర్లను ఆకర్షిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరో వైపు దానం నాగేందర్ అయితే గెలుపుపై ఏ మాత్రం అంచనాలు లేకుండా తూతూ మంత్రంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను కాంగ్రెస్ తప్పిస్తుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన ప్రచారం ముమ్మరంగా సాగించడం లేదు. దానం స్థానంలో బొంతు రామ్మోహన్ సతీమణిని పోటీకి దించుతారని పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో గెలిచే స్థానంలో పార్టీ ఓటమి పాలవుతుందని అంతా భావిస్తున్నారు. సూరత్ తరహాలోనే సికింద్రాబాద్‌లో సైతం కాంగ్రెస్ చేజారుతుందని అనుమానాలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: