టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పెద్ద చిక్కే వ‌చ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మిని ప‌రుగులు పెట్టించి.. గెలు పు గుర్రం ఎక్కేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అనేక జాగ్ర‌త్త‌ల‌తో అడుగులు ముందుకు వేశారు. కూట‌మి పార్టీల‌కు టికెట్ కేటాయింపు నుంచి టీడీపీ లోనూ గెలుపు గుర్రాల‌ను వెతికి ప‌ట్టుకునే వ‌ర‌కు కూడా.. చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే.. ఆయ‌న ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో రెబ‌ల్స్ బెడ‌ద త‌ప్ప‌డం లేదు.


నూజివీడులో టికెట్ ఆశించిన ముద్ర‌ర‌బోయిన వెంకటేశ్వ‌ర‌రావు నామినేష‌న్ వేశారు. ఈయ‌న‌ను ఎంత బ్రతిమాలినా.. త‌ప్పుకోవ‌డం లేదు. దీంతో టీడీపీ ఓటు చీలిపోయి.. కొలుసు పార్థ‌సార‌థికి ఎస‌రు పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. మంగ‌ళ‌గిరిలో నేరుగా టీడీపీకి వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేయ‌క‌పోయినా.. ఎక్కువ మంది ఇండిపెండెంట్లుగా నామినేష‌న్ వేశారు. పైగా.. భార‌త చైత‌న్య యువజ‌న పార్టీ త‌ర‌ఫున బోడే రామచంద్ర యాద‌వ్ ఇక్క‌డ బ‌రిలో ఉన్నారు.


మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపుపై బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. అదేవిధంగా కుప్పంలో 9 మంది బ‌ల‌మైన నాయ‌కులు నామినేష‌న్‌వేశారు. వీరంతా ఇండిపెం డెంట్లే అయినా.. చంద్ర‌బాబుకు సానుకూల ఓటు బ్యాంకు ఉన్న మండ‌లాలకు చెందిన వారు కావ‌డంతో ఆయా మండలాల్లో ఓట్లు వీరికి అనుకూలంగా ప‌డితే చంద్ర‌బాబుకు ఇబ్బంది ఖాయం. విశాఖ ఎంపీ స్తానం నుంచి బ‌రిలో ఉన్న బాల‌య్య చిన్న‌ల్లుడి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.


ముఖ్యంగా హిందూపురం నుంచి స‌ర్వ‌స్వ‌తీ పీఠం ఉపాస‌కులు.. ప‌రిపూర్ణానంద స్వతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఈయ‌న ఎఫెక్ట్ బాల‌య్య‌పై కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు గుర్తించారు. దీంతో ఆయ‌న‌ను రెండు ద‌ఫాలు పిలిచి చ‌ర్చించారు. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇలా. కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో రెబ‌ల్స్ బెడ‌ద‌.. చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. 28 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉన్నా.. ఎంత మందిని బుజ్జ‌గిస్తార‌నేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: