తెలంగాణలో కేబినెట్ విస్తరణపై  పెద్ద స‌స్పెన్స్ నెలకొంది. మొదట లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ బెర్త్ లను భర్తీ చేస్తారని ప్రచారం జ‌రిగింది. అయితే ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లు అయిపోయాయి. ఇక ఫ‌లితాలు రావ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల త‌ర్వాత కూడా కేబినెట్ బెర్త్‌ల చ‌ర్చ రావ‌డం లేదు. దీంతో కేబినెట్ విస్త‌ర‌ణ మ‌రింత ఆల‌స్యం అవుతుందా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.


ఇక కొంద‌రు నేత‌లు అయితే అప్పుడే లాబీయింగ్‌లు స్టార్ట్ చేసేశారు. కుల స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా తమకు మంత్రి పదవి ఇవ్వాలని చాలామంది నేతలు ప్రపోజల్ పెట్టుకుంటోన్న ప‌రిస్థితి. అయితే ఇప్పుడు కొత్త ప్ర‌చారం న‌డుస్తోంది.  స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో సహా 12 మంది మంత్రులు ఉండ‌గా.. మరో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉండ‌డంతో వాటిని జిల్లాలు, సామాజిక వ‌ర్గాల వారీగా భ‌ర్తీ చేస్తున్నారు.


ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేక‌పోవ‌డంతో త్వరలో భర్తీ చేసే మంత్రి పదవుల నియామకంలో ఈ జిల్లాలకు చెందిన నేతలకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తార‌ని టాక్ ? ఇక రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి.


నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఉంది. ఇక్క‌డ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. రేవంత్ కేబినెట్ లో ఇప్పటికే సీఎంతో కలిసి ఏడుగురు ఓసీలు ఉండటంతో సీనియర్ నేతలైన రెడ్లకు అవకాశం ఉంటుందా..? అన్న సందేహం కూడా ఉంది. ఏదేమైనా శ‌నివారం తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: