- రెండు పార్టీల్లోనూ మంత్రి అయిన ఘ‌న‌త‌
- శెట్టిబ‌లిజ‌ల్లో గుర్తింపే పొలిటిక‌ల్ హీరోను చేసిందా ?
- తాజా ఎన్నిక‌ల్లో గెలిచి... కూట‌మి వ‌స్తే మ‌ళ్లీ మంత్రైన‌ట్టే..?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

పితాని స‌త్య‌నారాయ‌ణ బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల్లో శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం నుంచి న‌లుగురు ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర మంత్రిగా ప‌నిచేసే స్థాయికి ఎదిగిన నేత‌. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పోడూరు మండ‌లంలోని కొమ్ముచిక్కాల మంత్రి పితాని స్వ‌గ్రామం. 1989 నుంచి ప్ర‌తి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పితాని అసెంబ్లీకి పోటీ చేస్తూ వ‌స్తున్నారు. 2004లో పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత 2009 నుంచి ఆచంట నుంచి రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు.


2004లో పెనుగొండ నుంచి, 2009లో ఆచంట నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచిన పితాని.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో టీడీపీ నుంచి గెలిచారు. మ‌ధ్య‌లో ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లి టీడీపీలోకి వ‌చ్చారు. తాజా ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఆచంట నుంచే టీడీపీ త‌ర‌పున పోటీలో ఉన్నారు. పితాని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో మెంబ‌ర్ కూడా..!  శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో పితాని తిరుగులేని ముద్ర వేసుకున్నారు. ఆ క్యాస్ట్‌లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది.


ఈ సామాజిక వ‌ర్గం అండ‌దండ‌ల‌తోనే ఆయ‌న ఈ రోజు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఎదిగార‌న‌డంలో సందేహం లేదు. అలాగే పార్టీల‌కు అతీతంగా ఆ సామాజిక వ‌ర్గానికి ఆయ‌న అండ‌గా ఉంటూ వ‌చ్చారు కూడా..! వైఎస్సార్‌, రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు మంత్రివ‌ర్గాల్లో ఆయ‌న మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ రెండు పార్టీల నుంచి మంత్రిగాను.. అలాగే ర‌ద్ద‌యిన పెనుగొండ‌, ఆచంట నుంచి కూడా ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు. ఇక పితాని ఛైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ పెడరేషన్, ఆరోగ్యశ్రీ శాఖా మంత్రిగా పనిచేసారు. టీడీపీ ప్ర‌భుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు.


తాజా ఎన్నిక‌ల్లో ఆచంట నుంచే బ‌రిలో ఉన్న ఆయ‌న ఎమ్మెల్యే అయ్యి.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే ఖ‌చ్చితంగా శెట్టిబ‌లిజ కోటాలో మంత్రి అవుతార‌నే చెప్పాలి. శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో రెండున్న‌ర ద‌శాబ్దాలుగా పితాని రాజ‌కీయ ప‌రంగా చెర‌గ‌ని ముద్ర వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: