సార్వత్రిక ఎన్నికల్లో హైలెంట్ అంశం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో మొత్తం ఏడు దశల్లో జరిగే పోలింగ్.. సోమవారంతో ఐదు దశలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ఒక ఎత్తు అయితే అయిదో దశలో జరిగిన పోలింగ్ మరో ఎత్తుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.


ఏది ఏమైనా గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు అంత ఉత్సాహంగా జరగడం లేదనేది వాస్తవం. కారణం ఏదైనా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే వీటిని వేవ్ లెస్ ఎన్నికలుగా పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. దశాబ్దాల తరబడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని కశ్మీరులు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. దేశం మొత్తం ఒక ఎత్తు అయితే… మేం మరో ఎత్తు అంటూ భారా ఎత్తున పోలింగ్ లో భాగస్వాములు అయ్యారు.


సోమవారం జరిగిన ఎనిమిది రాష్ట్రాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో అందర్నీ ఆకర్షిస్తున్న అంశం జమ్మూ కశ్మీర్. ఇక్కడ ఏకంగా 56.73 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. లడక్ లో అయితే 69.62 శాతం. చూడటానికి ఈ సంఖ్యలు తక్కువగానే కనిపిస్తున్నా గత పాతికేళ్ల రికార్డును చూస్తే మాత్రం వావ్ అనిపించక మానదు. ఎందుకంటే  ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ సింగిల్ డిజిట్ శాతానికే పోలింగ్ జరిగేది.


గడిచిన నలభై ఏళ్లలో ఎన్నికల పోలింగ్  అంటే ఏడెనిమిది శాతం. మహా అయితే తొమ్మిది శాతం. అంతకు మించి అడుగు ముందుకు పడని పరిస్థితి. పోలింగ్ నిర్వహిస్తే మాకు సంబంధం లేదనే విధంగా కశ్మీరీల వ్యవహార శైలి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏకంగా 60శాతం నమోదు కావడం అంటే రికార్డనే చెప్పాలి. ఇక ఇదే సమయంలో యూపీ(57.8), బిహార్, మహారాష్ట్రలో 54శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. అంటే ఈ రాష్ట్రాలతో పోల్చితే జమ్మూ కశ్మీర్ లో భారీ పోలింగ్ నమోదు కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: