పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరల చుక్కలంటుతున్నాయి. దివాళా తీసిన శ్రీలంకను కూడా ధరలు మించిపోయాయి. గోధుమ పిండి, ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు.. చాలా నెలల క్రితమే పాకిస్థాన్ దయనీయ స్థితిని ప్రపంచానికి చూపించాయి. అప్పు దొరక్క ఆదుకునేవారు లేక, గడ్డు పరిస్థితులను ఎలా దాటాలో  తెలియక, ప్రజల కనీస అవసరాలు తీర్చే మార్గం లేక రెండేళ్ల నుంచి అల్లాడుతోంది.


అయినా సరే.. ఆ దేశానికి బుద్ధి రాలేదు. ప్రజల ఆకలి ఎలా తీర్చాలో ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఆ దేశ అప్పు 124.50 బిలియన్ డాలర్లు. ఇది పాకిస్థాన్ జీడీపీలో 42 శాతానికి సమానం. అయినా ఆ దేశం ఆయుధాల దిగుమతిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మిలటరీ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే చైనాపై ఆధారపడుతోంది. ఇప్పుడు అక్షరాలా రూ.18 వేల కోట్లను రక్షణ రంగానికి కేటాయించింది. పాకిస్థాన్ ఇక మారదని.. ఆ దేశం మెరుగుపడే పరిస్థితులే లేవని.. దానికి ఈ కేటాయింపులే రుజువు అని పలువురు విమర్శిస్తున్నారు.


రాజకీయ అస్థిరతలు, విదేశీ జోక్యాలు, కీలుబొమ్మ ప్రభుత్వాలు, ఆర్మీ గుత్తాధిపత్యాలు వెరసి.. ఆవిర్భావం నుంచి పాకిస్థాన్ ఇలాంటి సంక్షోభాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. మొన్నటి వరకు అందిన కాడికి అప్పులు ఇచ్చిన అమెరికా, చైనాలు ఇప్పుడు మొహం చాటేస్తున్నాయి. శ్రీలంక సంక్షోభం చూసిన తర్వాత ఆసియాలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతోంది పాకిస్థాన్ లోనే. రిటైల్ ధరలు గత ఏడాదితో పోల్చితే 36.4శాతం పెరిగింది. 1964 తర్వాత ద్రవ్యోల్భణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి.


దాదాపు ఏడాదిన్నర నుంచి పాక్ ది ఇదే దుస్థితి. అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఐఎమ్ఎఫ్ నుంచి 6.5 బిలియన్ డాలర్ల సాయం కోసం పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. ఈ సాయం అందాలంటే సబ్సిడీలు ఎత్తేయాలి. పన్నులు  భారీగా పెంచాలి. ఇదే జరిగితే ద్రవ్యోల్భణం మరింత పెరుగుతుంది. ఈ నెల ప్రారంభంలో అక్కడ లీటరు పాలు 210 రూపాయలు. కిలో పిండి రూ. 800, కిలో బియ్యం రూ.200-400 మధ్య ఉంది. అయినా ఆ దేశం మారడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: