ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వివాదం రాజుకుంది. ఏపీ సీఎం ఆఫీస్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతులు ఇవ్వాలని యూపీఎస్సీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి లేఖ రాసిన విషయం బట్టబయలు అయింది. ఈ ప్రమోషన్ల వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం సృష్టించింది. విదేశాల్లో ఫ్యామిలీ టైమ్‌ గడుపుతున్న చంద్రబాబుకు కూడా ఈ ప్రమోషన్ల గురించి తెలిసింది. దాంతో వెంటనే ఆయన యూపీఎస్సీకి ఒక లేఖ రాశారు. జవహర్ రెడ్డి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్న అధికారులందరూ జగన్ కార్యాల‌యం మనుషులు అంటూ లేఖలో మండిపడ్డారు.

కొందరిని సెలెక్ట్ చేసి వారికి మాత్రమే పదోన్నతులు ఇవ్వడం ఏ విధంగానూ న్యాయం కాదు అని ఆక్రోషం వెళ్లగక్కారు. కొందరిని సెలెక్ట్ చేసే వారికి ఐపీఎస్‌లు ఇవ్వడం రాజకీయ దురుద్దేశం అవుతుందని, ఇందులో పూర్తిగా పారదర్శకత అనేది లోపించిందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ కార్యాలయ మనుషులకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రమోషన్లను ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు కొనసాగుతున్నాయని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రమోషన్లు ఇవ్వాలని సిఫార్సు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా గుర్తు చేశారు. అందుకే ఈ ప్ర‌క్రియ‌ల‌ను వెంటనే నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇవ్వాలని రికమెండ్ చేసిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే (జూన్ 4) వరకు ఈ ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేకులు వేయాలని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్పడిన తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయిన వారికే ప్ర‌మోష‌న్లు ఇచ్చే ధోరణిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇకపోతే ప‌లువురు అధికారుల‌ను ఐఏఎస్‌లుగా ప్రమోట్ చేయాలంటూ జ‌వ‌హ‌ర్‌రెడ్డి సీక్రెట్ గా యూపీఎస్సీకి లెటర్ రాశారు. ఆ విషయం కాస్త లీక్ అయ్యింది. అయితే జగన్ ప్లాన్ ని చంద్రబాబు విదేశాల్లో ఉండే భగ్నం చేశారని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: