టీడీపీ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్ తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్ని స్తున్నారు. ప్ర‌స్తుతం ముగిసిన పోలింగ్‌లో నారాయ‌ణ నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఈయ‌న గెలుపుపై ఇటు పార్టీలోను.. అటు వ్య‌క్తిగతంగా కూడా.. చాలానే అంచ‌నాలు ఉన్నాయి. అయితే.. ఇక్క‌డ పార్టీ కోసం కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర నేత‌లు బాగానే క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. నారాయ‌ణ ను ఈ ద‌ఫా గెలిపించుకోవాల‌న్న క‌సి క‌నిపించింది.


గ‌త ఎన్నికల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీ చేసిన నారాయ‌ణ‌.. స్వ‌ల్ప ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. త‌ర్వాత ఆయ‌నను రాజ‌కీయంగా వేధించారు. అరెస్టులు.. గృహ నిర్బంధాలు.. ఇళ్ల‌లో త‌నిఖీలు...ఇలా అనేక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో స‌హ‌జంగానే నారాయ‌ణ‌పై సింప‌తిపెరిగింది. దీనికి తోడు ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రింత చేరువ చేసుకోవ‌డంతోపాటు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ఉన్నఅన్ని మార్గాల‌నూ వినియోగించుకున్నారు. ఫ‌లితంగా ఇప్పుడు నారాయ‌ణ గెలుపుపై ధీమా వ్య‌క్త‌మ‌వుతోంది.


ఇదిలావుంటే.. నారాయ‌ణ కోసం ఇక్క‌డ కేడ‌ర్ బలంగానే పోరాడారు. ప్ర‌చారం కూడా చేశారు. ఈ నేప‌థ్యం లో నారాయ‌ణ పార్టీ కార్య‌క‌ర్త‌ల రుణం తీర్చుకునేందుకు ఒక్క ఆలోచ‌న చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి న త‌ర్వాత‌.. పార్టీ కార్య‌కర్త‌ల కోసం.. రూ.10 కోట్లతో ఒక ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఏ అవ‌స‌రం వ‌చ్చినా దాని నుంచి వినియోగించుకునే లా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని నారాయ‌ణ చెబుతున్నారు.


అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ కార్య‌క‌ర్త‌కైనా ఆరోగ్యం బాగోక ఆసుప‌త్రిలో చేరినా.. ఇంట్లో శుభ‌కార్యాలైనా.. ఇత‌ర‌త్రా అవ‌స‌రం ఏదొచ్చినా.. నారాయ‌ణ ఏర్పాటు చేయ‌నున్న నిధి నుంచి వారిని ఆదుకోనున్నారు. దీనికి గాను నారాయ‌ణ 10 కోట్ల‌ను వెచ్చించాల‌ని నిర్ణ‌యించారు. ఒక‌వేళ ఇది మ‌నుగ‌డ‌లోకి క‌నుక వ‌స్తే.. ఇది ఒక సంచ‌ల‌న కార్య‌క్ర‌మం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇకపై దాదాపు అన్ని పార్టీల్లోని కీల‌క నాయ‌కులు ఈ విధానాన్ని అనుస‌రించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: