రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. అలాంటి పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. దీంతో రాష్ట్రంలో పార్టీ ఓటు శాతం పెంచేందుకు వైఎస్ షర్మిల విస్తృత పర్యటనలు చేశారు. ఆమె స్వయంగా ప్రస్తుత ఎన్నికల్లో కడప ఎంపీగా బరిలోకి దిగారు. ఆమె గెలుపు అంచనాలు ఎలా ఉన్నప్పటికీ పార్టీ ఓటు శాతం ఆమె ఎంత మేర పెంచగలరో అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుడినంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో విడుదల చేసిన లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంట్లో ఆ వ్యక్తి సంచలన ఆరోపణలు చేయడం ఆ పార్టీ శ్రేణులను నివ్వెరబోయేలా చేసింది.

కాంగ్రెస్ కార్యకర్త పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌ను పరిశీలిస్తే 'ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా పార్టీ ఇప్పుడున్న పరిస్థితులను చూడడం నా వల్ల, ఎక్కువ మంది వల్ల కావడం లేదు. ఇది వాస్తవం. ఎవరు ఏమనుకున్నా ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొంత మంది పెద్దలు పార్టీకి తమ వీలైనంత మేర, శక్తివంచన లేకుండా పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. కానీ పార్టీని అమ్మే ప్రయత్నం ఎవరూ చేయలేదు.


 అది ఇప్పుడు జరిగింది. ఎందుకు పార్టీని చంపే ప్రయత్నం చేస్తున్నారో, దాని వెనుక ఉన్న వారెవరో త్వరలో తెలుస్తుంది. పార్టీలో పని చేసిన వారికి కాకుండా టికెట్లు అమ్ముకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. అధిష్టానాన్ని కూడా ధిక్కరించి పార్టీ టికెట్లు అమ్ముకున్నారంటే వారి ఆలోచనలేంటో అర్ధం చేసుకోవచ్చు. దీని వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేస్తుంటే అందరూ చూస్తా ఉంటారనుకోవడం వారి భ్రమ......' అని ఆ పోస్ట్‌లో ఉంది. దీని ప్రకారం టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన నాయకుల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షర్మిలపై పోరాటం చేస్తామని, జూన్ 4 తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని పేర్కొనడం సంచలనంగా మారింది. దీంతో షర్మిలకు పార్టీలో పోరు తప్పదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: