ప్రధానిగా మోడీ పదేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. తాము దేశంలో ఎంతో అభివృద్ధి చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే నిత్యావసర సరుకుల ధరల నుంచి అన్నిటి ధరలు పెరగడంతో సామాన్యులపై చాలా భారం పడింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమ హయాంలో సాధించిన విజయాలు ఇవి అని బీజేపీ నేతలు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రజల్లోకి అవి ఎంత వరకు వెళ్లాయో, ఎంత వరకు ఆకట్టుకున్నాయో అర్ధం కాని పరిస్థితి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటివి నిస్సందేహంగా బీజేపీ విజయాలే.

 మరో వైపు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ అటకెక్కింది. కేవలం అందులో సగమైనా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే బాగుండేదని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికీ జాతీయవాదంపైనే ఆధారపడి ఎన్నికల బరిలోకి బీజేపీ బరిలోకి దిగింది. కాంగ్రెస్ మాత్రం ప్రజాకర్షక హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు.

అన్నికంటే ముఖ్యంగా పేదల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. పేదరికాన్ని పోగొట్టడానికి మహిళలకు ఏటా రూ.లక్ష అందజేస్తామని హామీనిచ్చింది. ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి అవకాశాలు పెంచుతామని యువతకు భరోసా ఇచ్చింది. ఆర్మీలో తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతున్న అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలుమార్లు ప్రకటించారు. వాటి స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరుగుతుందన్నారు.


ఇలా పేదలు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షల వైపు కాంగ్రెస్, ప్రతిపక్ష ఇండియా కూటమి గురి పెట్టింది. అందుకు తగ్గట్టే హామీలు ఇచ్చింది. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సామాన్య ప్రజలకు దగ్గరయ్యారు. దేశం మొత్తం పాదయాత్ర చేసి పేదల కష్టాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పదేళ్ల పాటు బీజేపీకి అవకాశమిచ్చిన ప్రజలు ప్రస్తుతం రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. కాలక్రమేణా మోడీకి ధీటైన నాయకుడిగా రాహుల్ ఎదుగుతున్నారు. తనదైన ప్రసంగాలతో బీజేపీని ఇరుకున పెడుతున్నారు. యూపీలో బీజేపీకి 2014లో 71 సీట్లు రాగా 2019లో ఆ సంఖ్య 62కి పడిపోయింది. బీహార్‌లో కూడా ఆ పార్టీకి సీట్లు తగ్గాయి. ఉత్తరాదిన ఆ పార్టీకి విజయావకాశాలు గతంలో కంటే తగ్గాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అది మరింత తగ్గితే కాంగ్రెస్‌కు లాభిస్తుందని అంటున్నారు. ఇదే నిజమైతే దేశం మార్పు కోరుకుంటున్న విషయం స్పష్టమవుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: