తాడిపత్రి రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఈసారి ఏకంగా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) రోహిత్ కుమార్ చౌదరిని లక్ష్యంగా చేసుకున్నారు. ఏఎస్పీ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ జేసీ చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో మరియు రాజకీయాలలో పెద్ద దుమారాన్ని సృష్టించాయి.

"పనికిమాలినవాడు, తెలివి లేదు!ష :
ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయి. ఏఎస్పీ "పనికిమాలినవాడు" అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉన్నప్పటికీ, తెలివి లేదని, ఆయన ఈ ఉద్యోగానికి పనికిరాడని జేసీ ధ్వజమెత్తారు. "ఇలాంటి ఏఎస్పీని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు" అని తీవ్ర వ్యాఖ్య చేశారు.

పోలీస్ వ్యవస్థకే మచ్చ? :
పోలీస్ వ్యవస్థకే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మచ్చ తెస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఐలు, కానిస్టేబుళ్లు లేకుండా ఏఎస్పీ బయటకు రాలేవని ఎద్దేవా చేశారు. ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఏఎస్పీ ఆఫీసు నుంచో, ఇంటి నుంచో బయటకు రాకుండా దాక్కున్నారని, రాళ్ల దాడి జరుగుతుంటే స్పందించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా, గతంలో పనిచేసిన డీఎస్పీ చైతన్య రెడ్డి కంటే కూడా రోహిత్ కుమార్ చౌదరి పనికిమాలినవాడివంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.

క్రైమ్ రేటు తగ్గడం క్రెడిట్ ఎవరిది? :
తాడిపత్రిలో నేరాలు తగ్గడానికి ఏఎస్పీ కారణం కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తాడిపత్రిలో క్రైమ్ రేటు తగ్గిందని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఏఎస్పీ ఇంటి ముందు తాను పడుకుని నిరసన తెలిపినా స్పందించలేదని, ఘర్షణలను నియంత్రించలేకపోయారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

కలకలం రేపుతున్న వ్యాఖ్యలు :
ఒక ఉన్నతాధికారిపై మాజీ ఎమ్మెల్యే ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా, పరిపాలనాపరంగా కలకలం రేపుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ వివాదం తాడిపత్రి రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. జేసీ వ్యాఖ్యలు అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: