బీజేపీకి సవాల్: ఓటర్లలో అయోమయం! :
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీని కేవలం 'ఓట్లు చీల్చే పార్టీ'గానే మిగిలిన రెండు పార్టీలు చిత్రీకరిస్తున్నాయి. ఇందుకు తోడు, ప్రత్యర్థి పార్టీల నుంచి పరస్పర ఆరోపణలు కమలనాథులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి "బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటే" అని ఆరోపిస్తే, బీఆర్‌ఎస్ అగ్రనేత కేటీఆర్ "బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటే" అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విమర్శల కారణంగా బీజేపీ రాజకీయ వైఖరిపై ప్రజల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. దీనికి తోడు, కమలనాథులు అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార వ్యూహాలు పదును తేలకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారింది.
ఏపీ పొత్తుల ప్రభావం: టీడీపీ-జనసేన ఓట్లపై ఆశ! :
బీజేపీకి ఈ ఉప ఎన్నికలో మరో పెద్ద సవాల్ ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తెలంగాణలో మాత్రం ఒంటరి పోరు చేస్తోంది. గత 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి జూబ్లీ హిల్స్‌లో కేవలం 25 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి అన్ని పార్టీలు దృష్టి సారించిన ఉప ఎన్నిక కావడంతో, ప్రతీ ఓటూ కీలకం. గత ఓట్లను నిలబెట్టుకుని, ఇంకా ఎక్కువ ఓట్లు సాధిస్తేనే బీజేపీకి పరువు దక్కుతుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ తన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల నుంచి పరోక్ష సహకారం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్‌లో టీడీపీకి ఓట్లు, జనసేనకు అభిమాన గణం గణనీయంగా ఉంది. ఈ ఓట్లు తమకే పడాలని బీజేపీ భావిస్తున్నా, బాహాటంగా మద్దతు కోరితే "ఆంధ్రా పార్టీలతో లింక్" పెడతారనే భయంతో మౌనంగా ఉంది.
ఏపీ నేతలే స్టార్ కాంపెయినర్లు! :
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏపీ ఓటర్లు అధికంగా ఉండటంతో, వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏపీ నుంచి కీలక నేతలను ప్రచారంలోకి దింపుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లను స్టార్ కాంపెయినర్లుగా రంగంలోకి దింపి, ఏపీ ఓట్లను రాబట్టాలని చూస్తోంది. ప్రచారంలో వెనుకబడినప్పటికీ, బీజేపీ గెలుపు ఆశలతోనే బరిలోకి దిగుతున్నా.. ఒకవేళ విజయం దక్కకపోయినా, కనీసం మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఏది ఏమైనా, జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అదృష్టం ఏపీ ఓటర్లు, పార్టీలు, నాయకుల అండదండలపైనే ఆధారపడి ఉందన్నది నిర్వివాదాంశం. దీనిపై ప్రత్యర్థులు ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి