తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పార్టీ కేడర్‌ను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అధికారం రాగానే కొందరు నేతలు చేస్తున్న అతి, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సమావేశం ప్రారంభం కావడమే చంద్రబాబు సూటి పోటి మాటలతో మొదలైంది. “కొందరు తాము ఎమ్మెల్యేలయిపోయామని, ఇక తమకు తిరుగులేదని ఫీలవుతున్నారు. కానీ మీరు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా? లేక ఎక్కువ కాలం ప్రజల మనసు గెలిచి శాసనసభ్యుడిగా కొనసాగుతారా? అనేది మీరే తేల్చుకోవాలి” అని బాబు నేతలను నిలదీశారు.

 గెలిచామన్న అహంకారంతో విర్రవీగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతంగా ఉంటుందని, ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.చాలా చోట్ల ప్రోటోకాల్ విషయంలో, ఫ్లెక్సీల విషయంలో తమ్ముళ్లు కొట్టుకుంటున్న వార్తలు బాబు దృష్టికి వెళ్లాయి. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు. “చిన్న చిన్న విషయాలకు గొడవలు పడవద్దు. ఫ్లెక్సీల మీద ఫోటోల దగ్గర వివాదాలు ఏంటి? పార్టీ ఏమైనా పర్లేదు.. నా ఫోటో ఉండాలి అనుకుంటే ఇక కుదరదు. ఇలాంటి పనుల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది.”

కేవలం ఎమ్మెల్యేలే కాదు, మంత్రులకు కూడా బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. “కేంద్ర మంత్రులు తప్పు చేస్తే జాతీయ స్థాయిలో, రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రస్థాయిలో బ్యాడ్ వార్తలు వస్తాయి. మీ వ్యక్తిగత తప్పులు ప్రభుత్వం మీద పడతాయి. అందుకే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి” అని సూచించారు.క్రమశిక్షణ విషయంలో తాను చాలా క్లియర్ గా ఉన్నానని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని, పద్ధతి మార్చుకోని నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని అల్టిమేటం జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: